settings icon
share icon
ప్రశ్న

శ్రమల కాలము అనగా ఏమి? ఈ శ్రమల కాలము ఏడు సంవత్సరములు ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది?

జవాబు


ఈ శ్రమల కాలము అనునది దేవుడు ఇశ్రాయేలు యొక్క క్రమశిక్షణను పూర్తిచేసి అవిశ్వాసులైన లోకముపై తన తీర్పును ముగించే ఏడు సంవత్సరముల కాలమును సూచిస్తుంది. పాపమును బట్టి వారిని శిక్షించకుండా వారిని రక్షించులాగున ప్రభువైన యేసు యొక్క వ్యక్తిత్వమునందును మరియు ఆయన యొక్క కార్యమునందును నమ్మకముంచునటువంటి సంఘము ఈ శ్రమల కాలములో ఉండదు. ఎత్తబడుట అనే ఒక సంఘటనలో సంఘము ఈ భూమిపై నుండి తీసుకొనివేయబడుతుంది (1 థెస్స. 4:13-18; 1 కొరింథీ. 15:51-53). రాబోవుచున్న ఉగ్రత నుండి సంఘము రక్షింపబడుతుంది (1 థెస్స. 5:9). లేఖనములంతటిలో, ఈ శ్రమల కాలము ప్రభువు దినము (యెషయా 2:12; 13:6-9; యోవేలు 1:15; 2:1-31; 3:14; 1 థెస్స. 5:2); నాశనము లేదా శ్రమల కాలము (ద్వితీయ. 4:30; జెఫన్యా 1:15); ఈ ఏడు సంవత్సరముల కాలము మధ్య భాగమును సూచించునటువంటి మహా శ్రమ కాలము (మత్తయి 24:21); ఆపద లేదా ఉగ్రత కాలము (దానియేలు 12:1; జెఫన్యా 1:15), యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము (యిర్మీయా 30:7) వంటి ఇతర పేరులతో కూడా సూచించబడింది.

ఈ శ్రమల కాలము యొక్క ఉద్దేశమును మరియు సమయమును గూర్చి తెలుసుకొనుటకు దానియేలు 9:24-27ను అధ్యయనం చేయడం అవసరం. ఈ వాక్యభాగము “నీ జనమునకు” వ్యతిరేకంగా ప్రకటించబడిన డెబ్బది వారములను గూర్చి మాట్లాడుతుంది. దానియేలు యొక్క ప్రజలు యూదులు, ఇశ్రాయేలు దేశము, మరియు దానియేలు 9:24 “తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును” దేవుడు అనుగ్రహించిన సమయమును గూర్చి మాట్లాడుతుంది. వీటన్నిటిని “డెబ్బదివారములు” కాలము నేరవేర్చును అని దేవుడు చెప్తున్నాడు. ఇది డెబ్బది సార్లు ఏడు సంవత్సరములు, లేదా 490 సంవత్సరములు. (కొన్ని అనువాదములు ఇక్కడ సంవత్సరములలో ఉన్న డెబ్బది వారములను సూచిస్తున్నవి). ఈ విషయము ఇదే దానియేలు గ్రంధములో ఉన్న మరొక వాక్యభాగము రూఢిపరుస్తుంది. 25 మరియు 26 వచనములలో యెరూషలేమును తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని “ఏడు వారములును . . . అరువది రెండు వారములును” (మొత్తము 69) జరిగిన తరువాత అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అని దానియేలుకు తెలుపబడింది. మరొక విధంగా చెప్పాలంటే, యెరూషలేమును తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని 69 ఏడుల సంవత్సరములు (483 సంవత్సరములు) జరిగిన తరువాత అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. యెరూషలేమును తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని యేసు సిలువపై మరణించిన సమయము వరకు 483 సంవత్సరములు గడిచినాయని పరిశుద్ధ గ్రంధపు చరిత్రకారులు చెబుతున్నారు. చాలా మంది క్రైస్తవ పండితులు, అంత్యదినముల శాస్త్రమును (భవిష్యత్ విషయములు/సంఘటనలు) గూర్చి వారికున్న వివిధ అభిప్రాయములకతీతంగా, 70 ఏడులను గూర్చి దానియేలు ఇచ్చిన అర్ధముతో ఏకీభవిస్తున్నారు.

యెరూషలేమును తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడు నిర్మూలము చేయబడు సమయము వరకు 483 సంవత్సరములు గడిచియుండగా, దానియేలు 9:24లోని ఒక ఏడు-సంవత్సరముల కాలము ఇంకా నెరవేర్చబడవలసినదిగా ఉంది: “తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును.” ఈ ఆఖరు ఏడు-సంవత్సరముల కాలమునే శ్రమల కాలము అంటారు – దేవుడు ఇశ్రాయేలును తన పాపమును బట్టి తీర్పు తీర్చుట ముగించే కాలము ఇది.

ఈ ఏడు-సంవత్సరముల శ్రమల కాలమును గూర్చి మరికొన్ని ముఖ్యమైన విషయములను దానియేలు 9:27 ఇస్తుంది: “అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.” ఈ వచనము మాట్లాడుతున్న ఈ వ్యక్తినే యేసు మత్తయి 24:15లో “నాశనకరమైన హేయవస్తువు”గా చెప్పాడు మరియు ప్రకటన 13లో “క్రూరమృగము” గా చెప్పబడింది. ఈ క్రూరమృగము ఏడు సంవత్సరముల పాటు ఒక నిబంధన చేస్తుందని, కాని ఈ వారమునకు మధ్యలో (అంటే శ్రమల కాలము ముగిసిన 3½ సంవత్సరములకు) వాడు ఆ నిబంధనను ఉల్లంఘించి, బలులను నిలిపివేస్తాడు అని దానియేలు 9:27 చెప్తుంది. దేవాలయములో ఈ క్రూరమృగము తన సొంత ప్రతిమను నిలువబెట్టి ప్రపంచమంతా తనకి ఆరాధాన చేయవలసినదిగా కోరుతుందని ప్రకటన 13 వివరిస్తుంది. ఇది 42 నెలల కాలము, అంటే 3½ సంవత్సరములు, జరుగుతుందని ప్రకటన 13:5 చెప్తుంది. ఇది అర్ధవారములో జరుగుతుందని దానియేలు 9:27 చెప్తుంది గనుకను, మరియు ప్రకటన 13:5 ప్రకారం ఈ క్రూరమృగము ఈ విధముగా 42 వారములు చేస్తుంది గనుకను, ఈ కాలము యొక్క పూర్తి సమయము 84 వారములు అనగా ఏడు సంవత్సరములు అని చెప్పడం చాల సుళువైన విషయం. “ఒక కాలము, కాలములు, అర్థకాలము” (కాలము = 1 సంవత్సరము; కాలములు = 2 సంవత్సరములు; అర్ధ కాలము = ½ సంవత్సరము; మొత్తము 3½ సంవత్సరములు) అని దానియేలు 7:25 చెప్తున్నప్పుడు అది “గొప్ప శ్రమ,”ను సూచిస్తుంది, ఏడు సంవత్సరముల శ్రమల కాలములో ఆఖరు సగభాగము ఈ క్రూరమృగము అధికారములో ఉండే శ్రమల కాలము.

ఈ శ్రమల కాలమును గూర్చి ఇతర ప్రస్తావనల కొరకు, 1260 రోజులను మరియు 42 వారములను గూర్చి ప్రస్తావించే ప్రకటన 11:2-3, 1290 రోజులు మరియు 1335 రోజులను గూర్చి ప్రస్తావించే దానియేలు 12:11-12 చూడండి. ఈ రోజులు శ్రమల కాలము మధ్య సమయమును సూచిస్తుంది. దానియేలు 12లో ఉన్న అధిక రోజులు దేశములను తీర్పుతీర్చే ఆ కడవరి కాలమును (మత్తయి 25:31-46) మరియు క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పరిపాలనను స్థాపించే ఆ కాలమును (ప్రకటన 20:4-6) సూచించేవిగా ఉన్నాయి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

శ్రమల కాలము అనగా ఏమి? ఈ శ్రమల కాలము ఏడు సంవత్సరములు ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries