settings icon
share icon
ప్రశ్న

సంఘము యొక్క ఉద్దేశము ఏమిటి?

జవాబు


అపొ. 2:42ను సంఘ ఉద్దేశము యొక్క కథనము అని పరిగణించవచ్చు. “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.” ఈ వచనము ప్రకారం, సంఘము యొక్క ఉద్దేశములు/కార్యములు ఏమైయుండాలి అంటే, 1) బైబిల్ సిద్ధాంతమును బోధించుట, 2) విశ్వాసులకు సహవాసం చేయు స్థలమును ఇచ్చుట, 3) ప్రభువు భోజనమును ఆచరించుట, మరియు 4) ప్రార్థించుట.

మనం విశ్వాసములో స్థిరపడియుండునట్లు, సంఘము బైబిల్ సిద్ధాంతమును బోధించవలెను. “అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడినప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక” అని ఎఫెసీ. 4:14 మనకు చెబుతుంది. క్రైస్తవులు ఒకరికొకరు సమర్పణ కలిగి ఒకరినొకరు గౌరవించు (రోమా. 12:10), ఒకరినొకరు హెచ్చరించు (రోమా. 15:14), ఒకరిపట్ల ఒకరు దయ మరియు కరుణ చూపు (ఎఫెసీ. 4:32), ఒకరినొకరు ప్రోత్సహించు (1 థెస్స. 5:11), మరియు అన్నిటికంటే ముఖ్యంగా, ఒకరినొకరు ప్రేమించు (1 యోహాను 3:11) సహవాసము చేయు స్థలము సంఘము.

క్రీస్తు మరణమును మరియు మన కొరకు చిందిన రక్తమును జ్ఞాపకం చేసుకొనుచు విశ్వాసులు ప్రభువు భోజనములో పాలిపంచుకొను స్థలము సంఘము (1 కొరింథీ. 11:23-26). “రొట్టె విరచుట” అను ఆలోచనలో (అపొ. 2:42) కలిసి భుజించు ఆలోచన కూడా ఉంది. సంఘము సహవాసమును ప్రతిపాదిస్తుంది అనుటకు ఇది మరొక ఉదాహరణ. అపొ. 2:42 ప్రకారం సంఘము యొక్క ఆఖరి ఉద్దేశము ప్రార్థన. సంఘము ప్రార్థనను బలపరచు, బోధించు, మరియు అభ్యసించు స్థలముగా ఉండాలి. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును” అని ఫిలిప్పీ. 4:6-7 మనలను ప్రోత్సహిస్తుంది.

యేసు క్రీస్తు ద్వారా రక్షణ సువార్తను ప్రకటించుట సంఘమునకు ఇవ్వబడిన మరొక ఆజ్ఞ (మత్తయి 28:18-20; అపొ. 1:8). క్రియల ద్వారా మరియు మాటల ద్వారా సువార్తను ప్రకటించుటలో సంఘము నమ్మకముగా ఉండుటకు పిలువబడెను. సమాజములో సంఘము “లైట్ హౌస్”గా ఉండి, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వైపుకు ప్రజలను నడిపించాలి. సంఘము సువార్తను ప్రచురించాలి మరియు తన సభ్యులను సువార్త ప్రకటించుటకు సిద్ధపరచాలి (1 పేతురు 3:15).

సంఘము యొక్క కొన్ని ముగింపు ఉద్దేశములు యాకోబు 1:27లో ఇవ్వబడినాయి: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.” సంఘము అవసరతలో ఉన్నవారికి సేవ చేయు పనిలో ఉండాలి. అంటే కేవలం సువార్త ప్రకటించుట మాత్రమే కాదు గాని, అవసరమునకు అనుగుణంగా శారీరక అవసరతలు (ఆహరం, వస్త్రములు, ఇల్లు) కూడా తీర్చాలి. పాపమును జయించి లోకములోని కాలుష్యము నుండి దూరముగా ఉండుటకు కావలసిన పరికరములను ఇచ్చి సంఘము విశ్వాసులను బలపరచాలి. దీనిని బైబిల్ బోధ ద్వారా మరియు క్రైస్తవ సహవాసం ద్వారా చేయవచ్చు.

కాబట్టి, సంఘము యొక్క ఉద్దేశము ఏమిటి? కొరింథులోని విశ్వాసులకు పౌలు చక్కటి ఉదాహరణ ఇచ్చాడు. సంఘము ఈ లోకములో దేవుని యొక్క చేతులు, నోరు మరియు పాదములై యుంది-క్రీస్తు శరీరము (1 కొరింథీ. 12:12-27). యేసు ఈ భూమిపై శారీరకముగా ఉన్నయెడల ఏ పనులు చేసేవాడో వాటిని మనం చెయ్యాలి. సంఘము “క్రైస్తవ్యంగా,” “క్రీస్తు-పోలికలో,” క్రీస్తును అనుసరించునదిగా ఉండాలి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

సంఘము యొక్క ఉద్దేశము ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries