settings icon
share icon
ప్రశ్న

పూర్వ ఏర్పాటు అనగానేమి? ఈ పూర్వ ఏర్పాటు పరిశుద్ధ గ్రంధానుసారమైనదేనా?

జవాబు


రోమీయులకు 8:29-30 వచనములలో “ఎందుకనగా తన కుమారుడు అనేకులలో జ్యేష్టుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమపరచెను” అని చదువుతాము. ఎఫెసీయులకు 1:5 మరియు 11 వచనములలో “. . . తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని . . . క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి . . . ఆ నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు” అని చదువుతున్నాము. చాలా మందికి ఈ పూర్వ ఏర్పాటు సిద్ధాంతము పట్ల వ్యతిరేక వైఖరి ఉంటుంది. కాని, పూర్వ ఏర్పాటు అనునది పరిశుద్ధ గ్రంధానుసారమైన సిద్ధాంతము. కాని ఇక్కడి మూలము ఏమంటే పరిశుద్ధ గ్రంధమును అనుసరించి ఈ పూర్వ ఏర్పాటు యొక్క అర్ధము ఏమైయున్నది అనేది అర్ధం చేసుకోవడం.

పైన పేర్కొనబడిన లేఖనభాగములలో ప్రస్తావించబడిన “ముందుగా నిర్ణయించుకొనిన” అనే మాట గ్రీకు పదమైన proorizo, అంటే “ముందుగానే నిశ్చయించిన,” “ప్రతిష్టించిన,” “సమయమునకు పూర్వమే నిర్ణయించుట” అనే అర్ధమునిచ్చే పదమునుండి సంగ్రహించబడింది. కాబట్టి, పూర్వ ఏర్పాటు అనగా సమయమునకు మునుపే కొన్నిటిని దేవుడు జరుగునట్లు నిర్ణయించడం. సమయమునకు పూర్వమే దేవుడు జరుగ నిర్ణయించిన ఆ సంగతులు ఏమిటి? రోమీయులకు 8:29-30 ప్రకారం కొంత మంది వ్యక్తులు దేవుని కుమారుని యొక్క సారూప్యముగల వారగుటకు, పిలువబడుటకు, నీతిమంతులుగా తీర్చబడుటకు మరియు మహిమపరచబడుటకు దేవుడు నిర్ణయించాడు అని చదువుతాము. అవసరముగా, కొంతమంది వ్యక్తులు రక్షింపబడతారని దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. క్రీస్తునందు విశ్వాసులు ఎన్నికచేయబడినవారు అని లేఖనములలో ఎన్నో వచనములు చెప్తున్నాయి (మత్తయి 24:22, 31; మార్కు 13:20, 27; రోమీయులకు 8:33; 9:11; 11:5-7, 28; ఎఫెసీయులకు 1:11; కొలస్సీయులకు 3:12; 1 థెస్సలొనీకయులకు 1:4; 1 తిమోతి 5:21; 2 తిమోతి 2:10; తీతుకు 1:1; 1 పేతురు 1:1-2; 2:9; 2 పేతురు 1:10). దేవుడు తన సార్వభౌమత్వ అధికారములో కొంతమంది వ్యక్తులను రక్షణ కొరకు ఎన్నుకుంటాడు అనేదే ఈ పూర్వ ఏర్పాటు అనే సిద్ధాంతము.

ఈ పూర్వ ఏర్పాటు సిద్ధాంతమునకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన ఆటంకము ఏమంటే అది న్యాయమైనది కాదు అనే వాదన. దేవుడు కొంతమంది వ్యక్తులను మాత్రమే ఎన్నుకొని ఇతరులను ఎందుకు వదిలేస్తాడు? గుర్తుంచుకొనవలసిన ప్రాముఖ్యమైన విషయము ఏమంటే ఎవరు కూడా రక్షింపబడుటకు అర్హులు కారు. మనమందరమూ పాపము చేసాము (రోమీయులకు 3:23), మరియు అందరమూ నిత్య శిక్షకు యోగ్యులముగా ఉన్నాము (రోమీయులకు 6:23). ఫలితంగా, మన అందరి నిత్యత్వమును నరకములో గడుపుటకు దేవుడు అనుమతించినట్లయితే దేవుడు నీతిమంతుడుగానే తీర్చబడతాడు. కాని, కొందరిని రక్షించుటకు దేవుడు ఎన్నుకోన్నాడు. ఎన్నుకొనబడని వారి విషయంలో ఆయన అన్యాయంగా ప్రవర్తించలేదు, ఎందుకంటే వారు అర్హమైన దానిని వారు పొందుకుంటున్నారు. కొందరి యెడల కృపాసహితముగా ఉండుటకు దేవుడు ఎన్నుకోవడం అంటే ఇతరులకు అన్యాయం చేస్తున్నాడు అని కాదు. దేవుని నుండి ఎవరు కూడా ఏమియు పొందనర్హులు కారు; కాబట్టి, ఒకరు దేవుని నుండి ఏదైనా పొందుకొనకుండా ఉంటే ఎవరూ ఆటంకపరచకూడదు. దీనికి ఒక ఉదాహరణగా తీసుకుంటే ఇరువది మంది ఉన్న ఒక గుంపులో ఒక వ్యక్తి వచ్చి స్వచ్చందంగా ఐదుగురికి డబ్బులు పంచిపెట్టాడు అనుకుందాం. డబ్బులు తీసుకోలేకపోయిన ఆ పదిహేను మంది నిరాశపడతారా? నిరాశ పడవచ్చు. అలా నిరాశపడుటకు వారికి ఏమైనా హక్కు ఉందా? లేదు, వారికి ఆ హక్కు లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరికీ కూడా ఆ వ్యక్తి ఎటువంటి డబ్బును అచ్చిఉండ లేదు. కొందరిపట్ల కృపాసహితముగా ఉండుటకు ఆయన నిర్ణయించుకున్నాడు.

ఎవరు రక్షింపబడాలి అని దేవుడే నిర్ణయించుకుంటే, క్రీస్తును ఎన్నుకొని ఆయనయండుద్ విశ్వాసముంచుటకు మనకు ఇవ్వబడిన ఆ స్వయం చిత్తమును కాలదన్నినవాడు అవ్వడా? మనకు చేసుకొనుటకు ఎంపిక ఉన్నదని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది – యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతివాడు రక్షణ పొందును (యోహాను 3:16; రోమీయులకు 10:9-10). ఆయనయందు విశ్వాసముంచిన వారిని లేదా ఎవరినైనా దేవుడు తిరస్కరించినట్లు లేదా ఆయనను వెదికిన వారి నుండి ఆయన దూరముగా వెళ్ళిపోయినట్లు పరిశుద్ధ గ్రంధము ఎక్కడా చెప్పుటలేదు (ద్వితీయోపదేశకాండము 4:29). కాని కొంతవరకు దేవుని రహస్య ప్రణాళికలో, వ్యక్తి దేవునివద్దకు ఆకర్షించబడుటతోను (రోమీయులకు 1:16) మరియు రక్షణ నిమిత్తము ఆయనను నమ్ముకొనుటతోను ఈ పూర్వ ఏర్పాటు అనుసంధానముగా పనిచేస్తుంది (యోహాను 6:44). ఎవరు రక్షింపబడతారో అనే దానిని గూర్చి దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు, మరియు రక్షింపబడు నిమిత్తము మనము క్రీస్తును ఎన్నుకోవాలి. ఈ రెండు వాస్తవాలు సమానంగా సత్యాలు. రోమీయులకు 11:33వ వచనములో, “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు” అని చదువుతాము!

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పూర్వ ఏర్పాటు అనగానేమి? ఈ పూర్వ ఏర్పాటు పరిశుద్ధ గ్రంధానుసారమైనదేనా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries