settings icon
share icon
ప్రశ్న

మహమ్మారి రోగములను గూర్చి బైబిలు ఏమి బోధిస్తుంది?

జవాబు


ఎబోలా లేక కరోన వైరస్ వంటి అనేకరకముల మహమ్మారి రోగములు దాడిచేసినప్పుడు, దేవుడు ఇలాంటి మహమ్మారి రోగములకు ఎందుకు అనుమతి ఇస్తాడు-లేక ఎందుకు కలిగిస్తాడు-అని, ఇట్టి బలహీనతలు అంత్యకాలములకు చిహ్నముగా ఉన్నాయా అని అనేకమంది ప్రశ్నిస్తుంటారు. బైబిలు, ముఖ్యముగా పాత నిబంధన, తన ప్రజల మీద మరియు తన విరోధుల మీద “వారికి ఆయన బలమును చూపునట్లు” (నిర్గమ. 9:14, 16) దేవుడు ఈ తెగుళ్లను మరియు రోగములను కలిగించిన అనేక సందర్భములను వివరిస్తుంది. ఇశ్రాయేలీయులను దాసత్వములో నుండి విడిపించునట్లు ఫరోను బలవంతము చేయుటకు ఆయన ఐగుప్తు మీదికి తెగుళ్లను రప్పించాడు, మరియు వాటి బారినుండి తన ప్రజలను రక్షించాడు (నిర్గమ. 12:13; 15:26), ఈ విధంగా ఆయన రోగముల మీద మరియు ఇతర ఆపాదల మీద తన సార్వభౌమ నియంత్రణను కనుపరచాడు.

తన ప్రజలు అవిధేయులైతే తెగుళ్లు వంటి అనేక పరిణామాలను ఎదుర్కొవలసియుంటుంది అని దేవుడు హెచ్చరించాడు (లేవీ. 26:21, 25). రెండు సందర్భాలలో, పలు రకముల అవిధేయ కార్యముల కారణంగా దేవుడు 14,700 మంది ప్రజలను మరియు 24,000 మంది ప్రజలను హతము చేశాడు (సంఖ్యా. 16:49 మరియు 25:9). మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడిన తరువాత, అయితే దానికి విధేయులు కమ్మని లేకపోతే ఎబోలా వంటి అనేక దుష్టత్వములను ఎదుర్కొమన్ని దేవుడు ప్రజలను ఆజ్ఞాపించాడు: “యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను ... నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును” (ద్వితీ. 28:22). ఇవి దేవుడు కలిగించిన అనేక తెగుళ్లు మరియు రోగములకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ప్రేమ కనికరము గల మన దేవుడు తన ప్రజల మీద ఇట్టి ఉగ్రతను మరియు కోపమును చూపుటను గూర్చి ఊహించుకొనుట కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. అయితే దేవుడిచ్చు దండనలు ఎల్లప్పుడు పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణలను గురిగా కలిగియుంటాయి. 2 దిన. 7:13–14లో, దేవుడు సొలొమోనుతో ఇలా అనెను, “వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.” ఇక్కడ దేవుడు తన ప్రజలను తన వైపుకు ఆకర్షించుటకు, పశ్చాత్తాపమును కలిగించుటకు మరియు ఒక పరలోకపు తండ్రి యొక్క పిల్లల వలె వారికి ఆయన యొద్దకు వచ్చు ఆశను కలిగించుటకు ఆయన ఒక తెగులును ఉపయోగించుకుంటున్నాడు అని మనము చూస్తాము.

క్రొత్త నిబంధనలో, యేసు తాను సంచరించిన స్థలములలోని “ప్రతి రోగమును, ప్రతి బలహీనతను” మరియు తెగుళ్లనన్నిటిని బాగుచేశాడు (మత్తయి 9:35; 10:1; మార్కు 3:10). ఇశ్రాయేలీయులకు తన బలమును చూపుటకు దేవుడు తెగుళ్లను మరియు రోగమును ఎన్నుకొన్న విధముగానే, ఆయన నిజముగా దేవుని కుమారుడు అని రుజువు చేసుకొనుటకు యేసు వాటిని బాగుచేశాడు. వారి పరిచర్యను ధ్రువపరచుటకు తన శిష్యులకు కూడా ఆయన అదే స్వస్థపరచు శక్తిని అనుగ్రహించాడు (లూకా 9:1). దేవుడు ఇప్పటికి కూడా తన ఉద్దేశ్యముల నిమిత్తము బలహీనతలకు అనుమతి ఇస్తాడు, కాని కొన్నిసార్లు ప్రపంచవ్యాప్త మహమ్మారితో సహా అనేక రోగములు, పతనమైన లోకములో నివసించుటకు పరిణామములుగా మాత్రమే ఉన్నాయి. ఒక మహమ్మారికి విశేషమైన ఆత్మీయ కారణము ఉన్నదో లేదో నిర్థారించుటకు ఏ మార్గము లేదుగాని, దేవుడు సమస్తము మీద సార్వభౌమ నియంత్రణ కలిగియున్నాడు అని (రోమా. 11:36), ఆయనను ఎరిగినవారికి మరియు ప్రేమించువారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని మాత్రం మనకు తెలుసు (రోమా. 8:28).

ఎబోలా మరియు కరోన వైరస్ వంటి బలహీనతల యొక్క వ్యాప్తి అంత్యదినములలో రానున్న మహమ్మారి రోగములకు సూచకముగా ఉన్నది. అంత్య దినములకు సంబంధించిన భవిష్యత్ తెగుళ్లను గూర్చి యేసు బోధించాడు (లూకా 21:11). ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములోని ఇద్దరు సాక్షులకు, “వారికిష్టమైనప్పుడెల్లా, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు” (ప్రకటన 11:6) అధికారము కలదు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో వివరించబడినట్లు ఘోరమైన అంతిమ తీర్పులుగా ఏడు దూతలు క్రమముగా ఏడు తెగుళ్లను లోకము మీద కుమ్మరిస్తాయి.

మహమ్మారి రోగములను పాపమునకు దేవుడిచ్చు విశేషమైన తీర్పుగా పరిగణించవచ్చు లేక పరిగణించలేకపోవచ్చు. అవి పతనమైన లోకములో నివాసమునకు పరిణామాలు కూడా కావచ్చు. యేసు యొక్క రాకడ సమయమును గూర్చి ఎవరికి తెలియదు గనుక, ప్రపంచవ్యాప్త మహమ్మారి రోగములు మనము అంత్య దినములలో నివసించుచున్నామనుటకు రుజువుగా ఉన్నాయని చెప్పునప్పుడు మనము జాగ్రత్తపడాలి. యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించనివారికి, ఈ భూమి మీద జీవితము అల్పమైనదనుటకు మరియు దానిని ఏ క్షణములోనైనా కోల్పోయే అవకాశం ఉందనుటకు రోగము ఒక జ్ఞాపికగా ఉండాలి. మహమ్మారి రోగములు ఎంత ఘోరముగా ఉన్నా, నరకము వాటి కంటే ఘోరముగా ఉంటుంది. అయితే క్రైస్తవునికి మన కొరకు సిలువలో కార్చబడిన క్రీస్తు రక్తము ద్వారా రక్షణ నిశ్చయత మరియు నిత్యత్వ నిరీక్షణ ఉన్నవి (యెషయా 53:5; 2 కొరింథీ. 5:21; హెబ్రీ. 9:28).

క్రైస్తవులు మహమ్మారి రోగములకు ఎలా స్పందించాలి? మొదటిగా, భయపడవద్దు. దేవుడు నియంత్రణలో ఉన్నాడు. “భయపడకుము” వంటి పదమును బైబిలు 300 సార్లు ప్రస్తావిస్తుంది. రెండవదిగా, జ్ఞానము కలిగి ఉండండి. రోగము బారిన పడకుండా, మీ కుటుంబమును భద్రపరచి వారికి అవసరమైనవాటిని సమకూర్చుటకు తగిన చర్యలు తీసుకోండి. మూడవదిగా, పరిచర్య చేయుటకు అవకాశముల కొరకు వెదకండి. ప్రజలు తమ జీవితములను గూర్చి భయపడినప్పుడు, నిత్యత్వమును గూర్చి మాట్లాడుటకు వారు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ప్రేమకలిగి సత్యము పలుకుచు (ఎఫెసీ. 4:15), సువార్తను ప్రకటించునప్పుడు నిబ్బరముగాను కనికరము కలిగినవారిగాను ఉండండి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

మహమ్మారి రోగములను గూర్చి బైబిలు ఏమి బోధిస్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries