settings icon
share icon
ప్రశ్న

మరణం తరువాత జీవితమున్నదా?

జవాబు


మరణం తరువాత జీవితము ఉందా అనునది సార్వత్రిక ప్రశ్న. “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును...మరణము తరువాత నరులు బ్రతుకుదురా?” అని అంటూ యోబు మనందరి కొరకు మాట్లాడుచున్నాడు (యోబు 14:1-2, 14). యోబు వలె మనమంతా కూడ ఈ ప్రశ్న ద్వారా సవాల్ చేయబడితిమి. మనం మరణించిన తరువాత మనకు ఖచ్చితంగా ఏమి జరుగుతుంది? మన ఉనికి ఆగిపోతుందా? జీవితము చివరికి వ్యక్తిగత గొప్పతనమును పొందుటకు భూలోకమునకు వస్తూ పోతూ ఉండే తిరుగుచున్న ద్వారమా? అందరు ఒకే స్థలానికి వెళ్తారా, లేక మనం వేర్వేరు స్థలములకు వెళ్తామా? నిజంగా పరలోకం నరకం ఉన్నాయా?

మరణం తరువాత జీవితము మాత్రమే కాదు, మహిమకరమైన నిత్య జీవము ఉన్నదని, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు” (1 కొరింథీ. 2:9) అని బైబిల్ చెబుతుంది. యేసు క్రీస్తు, శరీరధారియైన దేవుడు, నిత్య జీవమను ఈ బహుమతిని మనకిచ్చుటకు ఈ భూమి మీదికి వచ్చెను. “మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5). మనమంతా పొందవలసిన శిక్షను యేసు తనపై వేసుకొని మన పాపమునకు పరిహారం చెల్లించుటకు తన జీవితమును బలిగా ఇచ్చెను. మూడు దినములు తరువాత, సమాధి నుండి తిరిగిలేచుట ద్వారా మరణముపైన ఆయన విజయవంతుడని రుజువు చేసెను. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళుటకు ముందు నలభై దినములు భూమి మీద ఉండి వేల మందికి కనిపించెను. “ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతుమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” అని రోమా. 4:25 చెబుతుంది.

క్రీస్తు యొక్క పునరుత్ధానం చక్కగా లిఖించబడిన సన్నివేశం. దీని చెల్లుబాటును పరీక్షించుటకు సాక్షులను ప్రశ్నించమని అపొస్తలుడైన పౌలు ప్రజలను అడిగెను గాని, దాని సత్యమును ఎవరు ఎదురించలేకపోయిరి. పునరుత్ధానం క్రైస్తవ విశ్వాసమునకు మూలరాయిగా ఉన్నది. క్రీస్తు మరణము నుండి తిరిగిలేచెను గనుక, మనము కూడ తిరిగి లేస్తామనే విశ్వాసం మనం కలిగియుండవచ్చు. యేసు యొక్క పునరుత్ధానం మరణం తరువాత జీవితానికి అంతిమ రుజువు. మరణము నుండి తిరిగి లేచు వారి గొప్ప కోతకు క్రీస్తు ప్రథమ ఫలము మాత్రమే. శారీరిక మరణం మనం అనుబంధం కలిగియున్న ఆదాము అను ఒకే పురుషుని ద్వారా వచ్చెను. అయితే యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని కుటుంబములోనికి స్వీకరించబడిన వారందరికీ నూతన జీవితము ఇవ్వబడును (1 కొరింథీ. 15:20-22). దేవుడు యేసు యొక్క శరీరమును లేపినట్లే, యేసు రాకడ వచ్చినప్పుడు మన శరీరములు కూడ లేపబడును (1 కొరింథీ. 6:14).

మనమంతా తుదకు తిరిగి లేచినప్పటికీ, అందరు పరలోకానికి వెళ్ళరు. ఈ జీవితములో ప్రతి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి, మరియు ఈ నిర్ణయం ఒకని నిత్య గమ్యమును శాసిస్తుంది. మనమంతా ఒక మారు మాత్రమే మరణించవలసియున్నదని, ఆ తరువాత తీర్పు వస్తుందని బైబిల్ చెబుతుంది (హెబ్రీ. 9:27). క్రీస్తుయందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడినవారంతా పరలోకములోనికి నిత్యజీవమునకు వెళ్ళుదురు, కాని క్రీస్తును రక్షకునిగా నిరాకరించినవారు నిత్య శిక్షలోనికి అనగా నరకములోనికి పంపబడుదురు (మత్తయి. 25:46). నరకము, పరలోకములానే, కేవలం నివసించు ఒక స్థితికాదు గాని, వాస్తవిక స్థలము. ఇది అనీతిమంతులు అంతముకాని, దేవుని నిత్య ఉగ్రతను అనుభవించు స్థలము. నరకము అగాధముగాను (లూకా 8:31; ప్రకటన 9:1), మరియు మండుచుండు అగ్ని గుండముగాను వివరించబడెను, మరియు ఇక్కడ ప్రజలు నిత్యము పగలు రాత్రి హింసించబడతారు (ప్రకటన 20:10). నరకములో గొప్ప దుఖమును కోపమును సూచిస్తూ, ఏడ్పులును పండ్లు కొరుకుటను ఉండును (మత్తయి. 13:42).

దుష్టుల మరణము దేవునికి అయిష్టమైనది, అయితే వారు తమ దుష్ట మార్గముల నుండి వెనుకకు తిరిగి జీవించాలని ఆయన ఆశించుచున్నాడు (యెహే. 33:11). అయితే ఆయన మనలను లోపరచడు; ఆయనను తిరస్కరించాలని మనం కోరినయెడల, నిత్యత్వములో ఆయనకు వేరుగా జీవించాలని మనం తీసుకొను నిర్ణయమును ఆయన అంగీకరిస్తాడు. భువిపై జీవితం ఒక పరీక్ష వంటిది, ఇది రానున్న వాటికి సిద్ధపాటు. విశ్వాసులకు, మరణము తరువాత జీవితము పరలోకములో దేవునితో నిత్యజీవము. అవిశ్వాసులకు, మరణము తరువాత జీవితము అగ్నిగుండములో నిత్యత్వము. మరణము తరువాత నిత్యజీవమును మనం ఎలా పొందగలము మరియు అగ్నిగుండములో నిత్యత్వమును ఎలా తప్పించుకొనగలము? ఒకే మార్గమున్నది-యేసు క్రీస్తులో విశ్వాసము మరియు నమ్మిక. యేసు చెప్పెను, “పునరుత్ధానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు...” (యోహాను 11:25-26).

నిత్య జీవమను ఉచిత బహుమానము అందరికీ అందుబాటులో ఉంది. “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును” (యోహాను 3:36). మరణము తరువాత రక్షణ అను దేవుని ఉచిత బహుమానమును స్వీకరించుటకు మనకు అవకాశం ఉండదు. మన భూలోక జీవితములలో యేసు క్రీస్తును అంగీకరించుట లేక తిరస్కరించుట మన నిత్య గమ్యమును శాసిస్తుంది. “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” (2 కొరింథీ. 6:2). దేవునికి విరోధముగా మనం చేసిన పాపమునకు యేసు క్రీస్తు యొక్క మరణం పరిపూర్ణ పరిహారం అని మనం నమ్మినయెడల, మనం కేవలం ఈ లోకములో మాత్రమే అర్థవంతమైన జీవితము కలిగియుండముగాని, మరణము తరువాత క్రీస్తు యొక్క మహిమగల సన్నిధిలో నిత్యజీవము కలిగియుందుము.

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

మరణం తరువాత జీవితమున్నదా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries