settings icon
share icon
ప్రశ్న

మానవుడు దేవుని పోలికెలో చేయబడ్డాడు అంటే అర్ధం ఏమిటి? (ఆదికాండము 1:26-27)

జవాబు


సృష్టిని చేసిన ఆఖరు దినమున, దేవుడు, “మనస్వరూపమందు మన పోలికె చొప్పుననరులను చేయుదము” అనుకున్నాడు (ఆదికాండము 1:26). ఈవిధంగా, దేవుడు తన పనిని తన “వ్యక్తిగత స్పర్శతో” ముగించాడు. దేవుడు మానవుని మట్టి నుండి రూపించి తన సొంత జీవవాయువును ఇచ్చుట ద్వారా తనకు జీవాన్ని ప్రసాదించాడు (ఆదికాండము 2:7). అలాగే, దేవుని సృష్టియంతటిలో మానవుడు చాలా విశిష్టత కలిగినవాడు, ఐహికమైన శరీరమును మరియు అనైహికమైన ప్రాణము/ఆత్మను కూడా కలిగిన వాడు.

దేవుని యొక్క “స్వరూపము” లేదా “పోలికె” కలిగియుండుట అంటే, అతి సాధారణమైన పదాలలో, మనము దేవుని పోలి ఉండుటకు చేయబడినాము అని అర్థము. దేవుడు రక్తమాంసములను కలిగినవాడు గనుక ఆదాము దేవుని పోలికెలో ఉన్నాడని కాదు. “దేవుడు ఆత్మయై ఉన్నాడు” (యోహాను 4:24) అని లేఖనములు చెప్తున్నాయి కాబట్టి ఆయన శరీరము లేకుండానే మనుగడలో ఉన్నాడు. కాని, ఆదాము యొక్క శరీరము పరిపూర్ణమైన ఆరోగ్యముతో రూపించబడి మరణమునకు లోనగుటకు కాకుండా చేయబడుటలో ఆదాము యొక్క శరీరము దేవుని యొక్క జీవమునకు దర్పణముగా ఉంది.

దేవుని యొక్క స్వరూపము అనునది మానవునిలో ఉన్న అనైహికమైన భాగమును సూచిస్తుంది. అది మానవుని జంతుప్రపంచం నుండి వేరు చేసి, ఈ భూమిపై అధిపతిగా ఉండాలని దేవుడు ఉద్దేశించిన కార్యమును మానవుడు నెరవేర్చులాగున సహాయపడుతుంది (ఆదికాండము 1:28), మరియు తన సృష్టికర్తతో మాట్లాడుటకు తనకు సహాయపడుతుంది. అది మానసికంగాను, నైతికముగాను, మరియు సామాజికముగాను ఉన్నటువంటి పోలికె.

మానసికముగా, మానవుడు ఒక ఆలోచన శక్తిని, హేతువాదమును కలిగినవాడిగా సృష్టించబడ్డాడు. మరొక మాటలలో చెప్పాలంటే, మానవుడు ఆలోచించగలడు మరియు ఎంపిక చెసుకొనగలడు. ఇది దేవుని జ్ఞానమును మరియు స్వతంత్రమును ప్రతిబింబింపచేసేదిగా ఉంది. ఎవరైనా ఒకరు ఒక యంత్రమును కనుగొన్నప్పుడు, ఒక పుస్తకమును వ్రాసినప్పుడు, ఒక చిత్రమును గీసినప్పుడు, ఒక సంగీతమును అనుభవిస్తున్నప్పుడు, ఒక లెక్కను కూడుతున్నప్పుడు, లేదా పెంపుడు జంతువుకు ఒక పేరును ఎంపిక చేసుకుంటున్నప్పుడు, మనము దేవుని పోలికెలో చేయబడ్డాము అనే సత్యాన్ని అతడు లేక ఆమె చాటుతుంది.

నైతికముగా, మానవుడు నీతిలోను పరిపూర్ణమైన అమాయకత్వములోను, అంటే దేవుని పరిశుద్ధతను ప్రతిబింబింపజేసే విధంగా, చేయబడ్డాడు. దేవుడు తాను చేసినదంతా చూసి (మానవులతో కలిపి) దానిని “చాలా మంచిది” అని పలికాడు (ఆదికాండము 1:31). మన మనసాక్షి లేదా “నైతికమైన దిక్సూచి” ఆ మూలమైన స్థితికి అవశేషముగా ఉంది. ఎప్పుడైనా ఒకరు ఒక చట్టమును వ్రాసినప్పుడు, దుర్మార్గత నుండి వెనుతిరిగినప్పుడు, మంచి ప్రవర్తనను అభినందించినప్పుడు, లేదా అపరాధభావనతో ఉన్నప్పుడు, మనము దేవుని సొంత పోలికెలో చేయబడ్డాము అనే సత్యాన్ని అతడు దృఢపరుస్తున్నాడని మనం తెలుసుకోవాలి.

సామాజికముగా, మానవుడు ఒక సహవాసము కొరకు సృష్టించబడ్డాడు. ఇది దేవుని యొక్క త్రిత్వ సహజమును మరియు ఆయన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఏదేనులో, మానవుని ప్రాధమిక సహవాసము దేవునితోనే (ఆదికాండము 3:8 దేవునితో సహవాసమును సూచిస్తుంది), మరియు “నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు” గనుక దేవుడు మొదటి స్త్రీని సృష్టించాడు (ఆదికాండము 1:28). ఎప్పుడైనా ఒకరు పెళ్ళాడినప్పుడు, స్నేహితులను ఏర్పరచుకున్నప్పుడు, బిడ్డను హత్తుకున్నప్పుడు, లేదా సంఘమునకు హాజరు అయినప్పుడు, మనము దేవుని స్వరూపములో చేయబడ్డాము అనే సత్యాన్ని ఆ వ్యక్తి వెల్లడి చేస్తున్నాడు.

దేవుని పోలికెలో సృష్టింపబడుటలో ఒక భాగము ఏమంటే ఆదాము తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకొనుటకు శక్తిని అనుగ్రహింపబడ్డాడు. నీతియుక్తమైన సహజ గుణము ఆయన దయచేయబడినప్పటికీ, ఆదాము ఒక దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకొని తన సృష్టికర్తకు వ్యతిరేకంగానే తిరుగుబాటు చేయాలని అనుకున్నాడు. ఆ విధంగా చేయుట వలన, తనలో ఉన్న దేవుని పోలికెకు ఆదాము మసిపూసాడు, మరియు ఆ దెబ్బతిన్న పోలికెనే తన సంతానము అందరిలోనికి అందించాడు (రోమీయులకు 5:12). ఈ రోజు, మనము ఇంకను దేవుని పోలికెనే భరిస్తున్నాము (యాకోబు 3:9), కాని పాపము యొక్క మచ్చలను కూడా మనము మోస్తున్నాము. మానసికంగా, నైతికంగా, సామాజికంగా, మరియు భౌతికంగా కూడా పాపము యొక్క ప్రభావమును మనము చూపుతున్నాము.

శుభవార్త ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని విడిపించేటప్పుడు, అతనిలో ఉన్న మూలమైన దేవుని పోలికెను తిరిగి స్థాపించుటకు దేవుడు ప్రారంభించి, “నీతియు యదార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికెగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు”కొనునట్లు చేస్తాడు (ఎఫెసీయులకు 4:24). ఆ విమోచన అనునది మనలను దేవుని నుండి వేరుపరుస్తున్న పాపమునుండి మనలను రక్షించుటకు శక్తిగలయేసుక్రీస్తులో విశ్వాసముంచుట వలన దేవుని కృప ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది (ఎఫెసీయులకు 2:8-9). క్రీస్తు ద్వారా, దేవుని పోలికెలో మనము నూతన సృష్టిగా చేయబడుతున్నాము (2 కొరింథీయులకు 5:17).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

మానవుడు దేవుని పోలికెలో చేయబడ్డాడు అంటే అర్ధం ఏమిటి? (ఆదికాండము 1:26-27)
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries