సంఘ హాజరు ఎందుకు ముఖ్యము?


ప్రశ్న: సంఘ హాజరు ఎందుకు ముఖ్యము?

జవాబు:
ఇతర విశ్వాసులతో కలసి దేవుని ఆరాధించుటకు మరియు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆయన వాక్యము మనకు బోధించబడుటకు మనం సంఘమునకు హాజరుకావాలని బైబిల్ చెబుతుంది. ఆదిమ సంఘము “అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి” (అపొ. 2:42). భక్తి యొక్క ఉదాహరణను మనం అనుసరించాలి-మరియు అవే విషయాలలో. ఆ రోజుల్లో, వారి యొద్ద ఎలాంటి సంఘ భవనము లేదు, అయినను “వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి” (అపొ. 2:46). కూడిక ఎక్కడ జరిగినప్పటికీ, విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసములో మరియు దేవుని వాక్యము యొక్క బోధలో బలపడేవారు.

సంఘ హాజరు కేవలం ఒక “మంచి సలహా” మాత్రమే కాదు; ఇది విశ్వాసుల కొరకు దేవుని చిత్తము. మనం “ఆ దినము సమీపించుట చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని హెబ్రీ. 10:25 తెలియజేస్తుంది. ఆదిమ సంఘములో కూడా ఇతర విశ్వాసులతో కూడుకొనకపోవుట అను చెడు అలవాటులో కొందరు పడుతున్నారు. అయితే అది సరైన మార్గము కాదని హెబ్రీ పత్రిక రచయిత చెబుతున్నాడు. సంఘ హాజరు ఇచ్చు ప్రోత్సాహం మనకు కావాలి. మరియు అంత్య దినముల యొక్క రాక మనలను సంఘమునకు వెళ్లుటకు మరింత పురికొల్పాలి.

సంఘము విశ్వాసులు ఒకరికొకరు ప్రేమ చూపు (1 యోహాను 4:12), ప్రోత్సహించు (హెబ్రీ. 3:13), ప్రేమ మరియు సత్ క్రియల కొరకు “పురికొల్పు” (హెబ్రీ. 10:24), ఒకరికొకరు సేవ చేయు (గలతీ. 5:13), హెచ్చరించు (రోమా. 15:14), ఒకరినొకరు గౌరవించు (రోమా. 12:10), మరియు ఒకరి పట్ల ఒకరు దయ కరుణ చూపు (ఎఫెసీ. 4:32) స్థలము.

ఒక వ్యక్తి రక్షణ కొరకు యేసు క్రీస్తును నమ్మినప్పుడు, అతడు లేక ఆమె క్రీస్తు శరీరములో సభ్యులవుతారు (1 కొరింథీ. 12:27). సంఘ శరీరము సరిగా పని చేయుటకు, దాని సమస్త “శరీర అంగములు” హాజరై పని చేయు విధంగా ఉండాలి (1 కొరింథీ. 12:14–20). ఒక సంఘమునకు హాజరగుట మాత్రమే సరిపోదు; దేవుడు మనకిచ్చిన ఆత్మీయ వరములు ఉపయోగించి, ఇతరుల కొరకు మనం ఏదో ఒక పరిచర్య చెయ్యాలి (ఎఫెసీ. 4:11–13). వరములను ఆ విధంగా ఉపయోగించకుండా ఒక విశ్వాసి ఎన్నడు పరిపూర్ణ ఆత్మీయ పరిపక్వతకు చేరలేడు, మరియు ఇతర విశ్వాసుల యొక్క సహాయం మరియు ప్రోత్సాహం మనందరికీ కావాలి (1 కొరింథీ. 12:21–26).

ఈ కారణాలు మరియు మరిన్ని కారణముల కొరకు, సంఘ హాజరు, పాలుపంపులు, మరియు సహవాసం ఒక విశ్వాసి జీవితంలో తరచు భాగమైయుండాలి. విశ్వాసుల కొరకు వార సంఘ హాజరు “అవసరం” లేదుగాని, క్రీస్తుకు చెందినవారై ఆయనను ఆరాధించాలని, వాక్యమును పొందాలని, మరియు ఇతర విశ్వాసులతో సహవాసం చెయ్యాలని ఆశ గలవారికి ఇది అవసరము.

యేసు క్రీస్తు సంఘమునకు మూలరాయి (1 పేతురు 2:6), మరియు మనం “యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము” (1 పేతురు 2:5). దేవుని “ఆత్మీయ గృహము” యొక్క నిర్మాణ వస్తువులుగా, మనలో స్వాభావికంగా ఒకరితో ఒకరికి అనుబంధం ఉంది, మరియు సంఘ సభ్యులు “సంఘమునకు వెళ్లిన” ప్రతి సారి ఆ అనుబంధం రుజువవుతుంది.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
సంఘ హాజరు ఎందుకు ముఖ్యము?