ప్రశ్న
ధనవంతుడు స్వర్గంలోకి ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడమే సులభం అని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు
ఒక ధనవంతుడు నిత్యజీవాన్ని పొందడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడమే సులభం అని యేసు చెప్పడంలో (మత్తయి 19:24; మార్కు 10:25; లూకా 18:25) ఆయన ఏమి ఉద్దేశించారనే దానిపై అనేక విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అసాధ్యమైన పని గురించి చెప్పడానికి పర్షియన్లు, "ఏనుగును" సూది రంధ్రం గుండా పంపించడం సులభం" అని అనేవారు. ఒంటె అనేది ఒక యూదుల అనుసరణ (ఇజ్రాయెల్‌లో అతిపెద్ద జంతువు ఒంటె).
యేసు ప్రస్తావించిన సూది గురించి కొందరు సిద్ధాంతీకరిస్తూ, అది యెరూషలేము చుట్టూ ఉన్న గోడలో ఉండే 'నీడిల్ గేట్' అని, అంటే పనివేళల తర్వాత ఉపయోగించే ఒక పొట్టి, ఇరుకైన ప్రవేశ ద్వారమని అంటారు. భద్రతా కారణాల వల్ల దానిని ఉద్దేశపూర్వకంగా చిన్నగా నిర్మించారు. దాని గుండా వెళ్ళడానికి ఒంటె తన సారెలను, సంచులను తీసివేసి, మోకాళ్ళపై పాకుతూ వెళ్ళవలసి వచ్చేది. ఈ సిద్ధాంతంతో ఉన్న సమస్య ఏమిటంటే, అటువంటి ద్వారం ఎప్పుడైనా ఉందని ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా, పెద్ద ద్వారాలు సులభంగా అందుబాటులో ఉన్నప్పుడు, ఏ సమజ్ఞానమున్న ఒంటె నడిపేవాడు అలాంటి కష్టాలు ఎందుకు పడతాడు?
ఇతరులు వాదించేదేమిటంటే, "ఒంటె" అని అనువదించబడిన పదం (గ్రీకు: kamelos) వాస్తవానికి "కేబుల్" (గ్రీకు: kamilos) అని ఉండాలి. అప్పుడు ఆ వాక్యం, సూది కంటి గుండా కేబుల్ (లేదా తాడు) పోవడం సులభం అని అర్థం వస్తుంది. అయితే, దీనిని నమ్మడం వల్ల అది పరిష్కరించే దానికంటే ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది, అదేమిటంటే, అది లేఖనాల దోషరహితత్వం మరియు ప్రేరణపై సందేహాన్ని కలిగిస్తుంది.
అత్యంత సంభావ్యమైన వివరణ ఏమిటంటే, యేసు అతిశయోక్తిని ఉపయోగించారు, ఇది నొక్కి చెప్పడానికి అతిశయోక్తిగా మాట్లాడే ఒక వాక్ప్రక్రియ. యేసు ఈ పద్ధతిని ఇతర సమయాల్లో కూడా ఉపయోగించారు, ఉదాహరణకు ఒకరి కంటిలోని "కర్ర" గురించి (మత్తయి 7:3-5) మరియు ఒంటెను మింగడం గురించి (మత్తయి 23:24) ప్రస్తావించారు.
యేసు సందేశం స్పష్టంగా ఉంది—తమ సొంత యోగ్యతల ద్వారా ఎవరూ రక్షణ పొందడం అసాధ్యం. సంపదను దేవుని ఆమోదానికి నిదర్శనంగా చూసినందున, ధనవంతులు దేవునిచే ఆశీర్వదించబడ్డారని, అందువల్ల వారే స్వర్గానికి అత్యంత అర్హులు అని రబ్బీలు సాధారణంగా బోధించారు. యేసు ఆ అభిప్రాయాన్ని, అలాగే ఎవరైనా నిత్యజీవాన్ని సంపాదించుకోవచ్చనే భావనను కూడా నాశనం చేశారు. ఈ ఆశ్చర్యకరమైన ప్రకటనకు శిష్యులు తగిన ప్రతిస్పందనను తెలిపారు. వారు పూర్తిగా ఆశ్చర్యపోయి, తర్వాతి వచనంలో, "అలా అయితే ఎవరు రక్షణ పొందగలరు?" అని అడిగారు. వారిలో అత్యంత ఆధ్యాత్మికులైన ఫరీశీయులు మరియు శాస్త్రులతో సహా ధనవంతులు పరలోకానికి అనర్హులైతే, ఒక పేదవాడికి ఏ ఆశ ఉండేది?
యేసు సమాధానమే సువార్తకు ఆధారం: "యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను" (మత్తయి 19:26). దేవుని కృప, దయ, విశ్వాసము అను వరముల ద్వారానే మనుషులు రక్షణ పొందుదురు (ఎఫెసయులు 2:8-9). మనం చేసే ఏ పనీ మనకు రక్షణను సంపాదించి పెట్టదు. ఆత్మలో దీనులైన వారే దేవుని రాజ్యానికి వారసులు (మత్తయి 5:3); అనగా తమ ఆత్మీయ దరిద్రాన్ని, పరిశుద్ధ దేవుని ముందు తమను తాము నీతిపరులుగా చేసుకోవడానికి ఏమీ చేయలేనని పూర్తిగా అంగీకరించే వారు. ధనవంతుడు తరచుగా తన ఆత్మీయ దరిద్రతను గ్రహించలేకపోతాడు, ఎందుకంటే అతను తన విజయాల గురించి గర్వపడతాడు మరియు తన సంపదతో సంతృప్తి చెందుతాడు. సూది రంద్రం గుండా ఒంటె దూరడం ఎంత అసాధ్యమో, అలాగే అతను దేవుని ముందు తనను తాను తగ్గించుకోవడం కూడా అసాధ్యం.
English
ధనవంతుడు స్వర్గంలోకి ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడమే సులభం అని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి?