settings icon
share icon
ప్రశ్న

జీవగ్రంథం అంటే ఏమిటి?

జవాబు


ప్రకటన గ్రంథము 20:15 ఇలా ప్రకటిస్తుంది, "ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను." ఈ సందర్భంలో, జీవగ్రంథము అనగా పరలోకంలో దేవునితో శాశ్వతంగా జీవించబోయే వారి పేర్ల సమితి. ఇది రక్షించబడిన వారి జాబితా. ఈ జీవగ్రంథం యొక్క ప్రస్తావన ప్రకటన 3:5; 20:12; మరియు ఫిలిప్పీయులు 4:3 లో కూడా ఉంది. ప్రభువైన యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారి పేర్లు ఇందులో ఉన్నందున, దీనిని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని కూడా పిలుస్తారు (ప్రకటన 13:8; 21:27).

జీవగ్రంథములో మీ పేరు వ్రాయబడినదని మీరెలా నిర్ధారించుకోగలరు? మీరు రక్షించబడ్డారని నిర్ధారించుకోండి. పాపమునకు పశ్చాత్తాపపడి, ప్రభువైన యేసుక్రీస్తును మీ రక్షకునిగా నమ్మండి (ఫిలిప్పీయులు 4:3; ప్రకటన 3:5). ఒకసారి మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడిన తర్వాత, అది ఎన్నటికీ చెరిపివేయబడదు (ప్రకటన 3:5; రోమీయులు 8:37-39). క్రీస్తులో తన నిత్య భద్రతను గూర్చి ఏ నిజ విశ్వాసి కూడా సందేహపడకూడదు (యోహాను 10:28-30).

ప్రకటన గ్రంథము 20:11-15లో వర్ణించబడిన గొప్ప తెల్ల సింహాసనపు తీర్పు అవిశ్వాసుల కొరకు గల ఒక తీర్పు. ఆ భాగము ఆ తీర్పులో ఎవరి పేరునూ జీవగ్రంథములో లేదని స్పష్టముగా తెలియజేయుచున్నది (ప్రకటన గ్రంథము 20:12-14). దేవునియందు విశ్వాసము లేని వారి గతి నిశ్చయము చేయబడినది; వారి పేర్లు జీవగ్రంథములో లేవు; వారి దండన నిశ్చయమైనది.

కొంతమంది ఒక వ్యక్తి తన రక్షణను కోల్పోవచ్చనడానికి సాక్ష్యంగా ప్రకటన గ్రంథము 3:5 ను చూపిస్తారు. అయితే, ప్రకటన గ్రంథము 3:5 లోని వాగ్దానం స్పష్టంగా ప్రభువు ఒక పేరును చెరిపివేయడని చెబుతుంది: "జయించిన వానిని . . . నేను జీవగ్రంథములో నుండి వాని పేరును చెరిపివేయను." విజేత అంటే ఈ లోకపు ప్రలోభాలు, శోధనలు మరియు చెడులపై విజయం సాధించిన వాడు—మరో మాటలో చెప్పాలంటే, విమోచన పొందిన వాడు. రక్షణ పొందిన వారి పేర్లు దేవుని రిజిస్ట్రీలో వ్రాయబడ్డాయి మరియు వారికి నిత్య భద్రత అనే వాగ్దానం ఉంది.

కొన్నిసార్లు గందరగోళం కలిగించే మరొక భాగం కీర్తనల గ్రంథం 69:28: "వారు [దావీదు శత్రువులు] జీవముగల వారి గ్రంథములో నుండి చెరిపివేయబడుదురు గాక." ఈ "జీవముగల వారి గ్రంథము"ను గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథముతో పొరబడకూడదు. దావీదు పరలోకంలోని శాశ్వత జీవమును కాక, భూమిపై ఉన్న శారీరక జీవమును సూచిస్తున్నాడు. నిర్గమకాండము 32:32-33లో ప్రస్తావించబడిన "గ్రంథము" విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.

దేవుడు మంచి లెక్కలు ఉంచుతాడు. ఆయనకు తనవారు ఎవరో తెలుసు, మరియు ఆయన తన పిల్లల పేర్లను తన గ్రంథములో శాశ్వతముగా వ్రాసియుంచెను.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

జీవగ్రంథం అంటే ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries