settings icon
share icon
ప్రశ్న

దేవుడు కాపాడలేని వారు ఎవరైనా ఉన్నారా?

జవాబు


దేవుడు సర్వశక్తిమంతుడని లేఖనము స్పష్టంగా చూపిస్తుంది: "ఇదిగో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైన నుండునా?" (యిర్మియా 32:27). దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా అని అడగడం ఆయన శక్తిని లేదా సామర్థ్యాన్ని ప్రశ్నించినట్లుగా ఉంటుంది. నిశ్చయంగా, దేవుడు ఎవరినైనా రక్షించగలడు, అయితే అందరూ రక్షించబడరు.

దేవునికి ఎవరినైనా రక్షించే అధికారం మరియు శక్తి ఉన్నాయి: "రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు" (యెషయా 59:1). దేవుని రక్షణ శక్తి ఒక వ్యక్తి చేసిన పాపం యొక్క పరిమాణం, రకం, లేదా వారు పాపం చేసిన సంవత్సరాల సంఖ్య ద్వారా పరిమితం కాదు. పౌలు అపొస్తలులలో ఒకరిగా మారడానికి ముందు సంఘాన్ని హింసించాడు (గలతీయులకు 1:23), ఇది దేవుని పరిధికి మించిన వారు ఎవరూ లేరని నిరూపిస్తుంది. తరువాత, పౌలు తన పరివర్తన గురించి ఇలా ప్రస్తూతించాడు, "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను, వారిలో నేను ప్రథముడను" (1 తిమోతి 1:15). దేవుడు పౌలును రక్షించినట్లయితే, ఆయన ఎవరినైనా రక్షించగలడు.

ఎవరైనా పాపమునకు పశ్చాత్తాపపడి, ప్రభువును నమ్ముకొని, దేవునిచే తిరస్కరించబడినట్లు లేఖనములలో ఎక్కడను లేదు. యేసు ఇలా వాగ్దానం చేశారు, "నాయొద్దకు వచ్చువానిని నేనెన్నటికిని బయటికి త్రోసివేయను" (యోహాను 6:37). ఆయనను పిలిచే వారందరికీ రక్షణ లభిస్తుంది: "యెహోవా నామమును పిలుచువారందరు రక్షణ పొందుదురు" (రోమీయులకు 10:13, యెహెజ్కేలు 33:11 ప్రకారం).

దేవుడు రక్షించలేని వారు ఎవరైనా ఉన్నారా? ఈ బైబిల్ ఉదాహరణలను పరిగణించండి:

• యేసు దయ్యాల సమూహం పట్టిన ఒక మనిషిని రక్షించాడు (లూకా 8:26–36).

• యేసు శిలువ మీద చనిపోతున్న ఒక దొంగను రక్షించాడు (లూకా 23:40–43).

• యేసు ఒక ఉన్నత స్థాయి ఇథియోపియన్ అధికారిని రక్షించాడు (అపోస్తలుల కార్యములు 8:26–39).

• యేసు సంఘాన్ని హత్య చేసే ఒక హింసకుడిని రక్షించాడు (అపొస్తలుల కార్యములు 9).

• యేసు ఒక రోమన్ శతధిపతిని రక్షించాడు (అపొస్తలుల కార్యములు 10).

• యేసు ఆత్మహత్య చేసుకోబోయిన ఒక చెరసాల అధికారిని రక్షించారు (అపొస్తలుల కార్యములు 16:27–34).

• యేసు సమాజపు అధిపతిని రక్షించాడు (అపొస్తలుల కార్యములు 18:8).

• యేసు మంత్రగాళ్లను మరియు దుష్టశక్తి గల స్త్రీలను రక్షించాడు (అపొస్తలుల కార్యములు 19:18–19).

• యేసు వ్యభిచారులను, విగ్రహారాధకులను, అక్రమ సంబంధాలు కలిగిన వారిని, స్వలింగ సంపర్కులను, దొంగలను, లోభియైన వారిని, మద్యపానులను, దూషకులను, మోసగాళ్లను రక్షించాడు (1 కొరింథీయులు 6:9–10).

బైబిలు యొక్క స్పష్టమైన బోధన ఏమిటంటే, దేవుడు ఎవరినైనా రక్షించగలడు. ఆయన కృపకు అందని వారు ఎవరూ లేరు. అదే సమయంలో, బైబిలు అందరూ రక్షించబడరని కూడా బోధిస్తుంది.

పవిత్రాత్మకు విరోధముగా చేసే దూషణ క్షమించబడదని యేసు ప్రకటించారు (మత్తయి 12:31–32). యేసు కాలంలోని పరిసయ్యులు ఈ పాపానికి పాల్పడ్డారు. మన కాలంలో, ఒకరి హృదయంలో పవిత్రాత్మ ద్వారా దేవుడు చేసే కార్యమునకు స్పందించడానికి నిరంతరంగా మరియు ఉద్దేశపూర్వకంగా నిరాకరించడమే ఈ పాపంగా పరిగణించవచ్చు. ఆత్మ యొక్క మనస్సాక్షిని నిరంతరం తిరస్కరించడమే ఈ పాపము, దీనికి క్షమాపణ ఉండదు.

రోమీయులు 1, దేవుడు ప్రజలను అవిశ్వాసానికి మరియు కఠిన హృదయానికి అప్పగించే ప్రక్రియను వివరిస్తుంది. దుష్టుల నిరంతర తిరుగుబాటుకు ప్రతిస్పందనగా, దేవుడు వారిని మూడు విషయాలకు "అప్పగించాడు":

⚬ "దేవుడు వారిని వారి హృదయపు దురాశలలో అపవిత్రతకు అప్పగించెను" (రోమీయులు 1:24, LSB).

⚬ "దేవుడు వారిని అగౌరవకరమైన కామవాసనలకు అప్పగించెను" (రోమీయులు 1:26, LSB).

⚬ "దేవుడు వారిని అనర్హమైన మనసుకు అప్పగించెను" (రోమీయులు 1:28, LSB).

రోమీయులు 1లో వర్ణించబడిన వంటి ప్రజలు దేవుని రక్షించగల సామర్థ్యానికి మించినవారు కాదు, కానీ వారి పశ్చాత్తాపపడని తిరుగుబాటు మరియు దేవునిని అంగీకరించడానికి నిరాకరించడం దేవుని తీర్పుకు దారితీస్తుంది—మరియు ఆ తీర్పులో ఒక భాగం క్రమంగా కఠినపడే హృదయం. పాపులు సహజంగా పాపాన్ని కోరుకుంటారు, మరియు దేవుని తీర్పు కొన్నిసార్లు వారు కోరుకున్నదాన్నే వారికి ఇవ్వడం రూపంలో ఉంటుంది.

దేవుడు కృప మరియు కరుణతో సమృద్ధిగా ఉన్నందున ఆయన మనలను పాపము నుండి రక్షించగలడు. ప్రపంచములోకి వెలుగు వచ్చింది; అయినప్పటికీ, కొందరు రక్షించబడరు, ఎందుకంటే వారు "తమ క్రియలు చెడ్డవైనందున వెలుగు కంటే చీకటిని ప్రేమించిరి" (యోహాను 3:19). ఎవరైనా రక్షించబడకపోతే, దానికి దేవుడు కారణం కాదు. ప్రతి వ్యక్తి తన ఆత్మ యొక్క స్థితికి తానే బాధ్యత వహించాలి.

అందరినీ రక్షించగల దేవుని శక్తిని గ్రహించడం, కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు మరింత మంది రక్షించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది (లూకా 10:2 చూడండి). పాపులు పశ్చాత్తాపపడి క్రీస్తును విశ్వసించమని పిలవడంలో సువార్త చాలా స్పష్టంగా ఉంది. ఆయన వైపు తిరిగిన వారెవరైనా పాపాల క్షమాపణను మరియు నిత్యజీవాన్ని పొందుతారు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుడు కాపాడలేని వారు ఎవరైనా ఉన్నారా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries