settings icon
share icon
ప్రశ్న

రోమీయుల దారి రక్షణ ఏమిటి?

జవాబు


రోమీయుల దారి రక్షణ అనగా రోమా పత్రికలోని వచనములు ఉపయోగించి రక్షణ సువార్తను వివరించుట. మనకు రక్షణ ఎందుకు కావాలి, దేవుడు రక్షణ ఎలా ఇచ్చాడు, మనం రక్షణ ఎలా పొందగలము, మరియు రక్షణ యొక్క పరిణామాలు ఏమిటి అను వాటిని వివరించుటకు సులువైన శక్తిగల పద్ధతి ఇది.

రోమీయుల దారి రక్షణలో మొదటి వాక్యము రోమా 3:23, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” మనమంతా పాపము చేశాము. మనమంతా దేవునికి అయిష్టమైన పనులు చేశాము. మన జీవితాలలో పాపము ఎలా ఉంటుంది అనుటకు రోమా 3:10-18 ఒక వివరణాత్మక చిత్రమును ఇస్తుంది. రోమీయుల దారి రక్షణకు రెండవ లేఖనము, రోమా 6:23, మనకు పాపము యొక్క పరిణామమును బోధిస్తుంది – “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.” మన పాపముల కొరకు మనం సాధించిన శిక్ష మరణము. కేవలం శారీరక మరణం కాదు, కాని నిత్య మరణం!

రోమీయుల దారి రక్షణకు మూడవ వచనము రోమా 6:23 ఆగిన చోట ఆరంభమవుతుంది, “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.” “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను,” అని రోమా 5:8 చెబుతుంది. యేసు క్రీస్తు మన కొరకు మరణించెను! యేసు మరణం మన పాపముల యొక్క వెల చెల్లించింది. మన పాపములకు పరిహారంగా దేవుడు యేసు యొక్క మరణమును అంగీకరించెను అని యేసు యొక్క పునరుత్ధానం నిరూపిస్తుంది.

రోమీయుల దారి రక్షణలో నాల్గవ గమ్యం రోమా 10:9, “అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.” మన కొరకు యేసు యొక్క మరణము వలన, మనం చేయవలసినదంతా ఆయనను నమ్ముట, ఆయన మరణము మన పాపములకు పరిహారం అని నమ్ముట – మరియు మనం రక్షించబడతాము! రోమా 10:13 మరలా చెబుతుంది, “ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.” మన పాపములకు పరిహారం చెల్లించుటకు మరియు నిత్య మరణము నుండి మనలను విడిపించుటకు యేసు మరణించెను. రక్షణ, పాప క్షమాపణ, యేసు క్రీస్తును ప్రభువు మరియు రక్షకుడని నమ్మిన ప్రతివారికి లభ్యమవుతుంది.

రక్షణ యొక్క పరిణామాలు రోమీయుల దారి రక్షణ యొక్క ఆఖరి అంశం. రోమా 5:1లో ఈ గొప్ప సందేశముంది, “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనం శాంతికరమైన అనుబంధం కలిగియుండవచ్చు. “కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు,” అని రోమా 8:1 మనకు బోధిస్తుంది. మన స్థానంలో యేసు యొక్క మరణం ద్వారా, మన పాపముల నిమిత్తం మనం ఎన్నడు శిక్షించబడము. చివరిగా, రోమా 8:38-39లో దేవుని యొక్క ఈ శ్రేష్టమైన వాగ్దానము ఉంది, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.”

మేఉ రోమీయుల దారి రక్షణను అనుసరించాలని కోరుచున్నారా? అయినచో, దేవునికి ఈ చిన్న ప్రార్థన చెయ్యండి. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

రోమీయుల దారి రక్షణ ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries