క్రైస్తవ్యం అంటే ఏంటి మరియు క్రైస్తవులు ఏమి నమ్ముతారు?


ప్రశ్న: క్రైస్తవ్యం అంటే ఏంటి మరియు క్రైస్తవులు ఏమి నమ్ముతారు?

జవాబు:
క్రైస్తవ్యం యొక్క ప్రధాన విశ్వాస ప్రమాణాలు 1 కొరింథీ. 15:1-4లో క్లుప్తంగా ఇవ్వబడ్డాయి. యేసు మన పాపముల కొరకు మరణించి, సమాధి చేయబడి, పునరుత్ధానుడై తిరిగి లేచి, తద్వారా విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించువారికి అందరికి రక్షణను ఇస్తున్నాడు. విశ్వాసములన్నిటి కంటే విశిష్టంగా, క్రైస్తవ్యం అనునది ఒక మతపరమైన ఆచరణముల కంటే కూడా అనుబంధమును గూర్చినదిగా ఉంది. చేయ “వలెను” మరియు చేయ “కూడదు” అని తెలిపే ఒక జాబితాను అనుసరించుటకు బదులు, క్రైస్తవుని యొక్క గురి దేవునితో ఒక సమీప నడకను పెంపొందించుకోవడం. అట్టి ఒక సంబంధము యేసు క్రీస్తు యొక్క కార్యము వలనను మరియు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య వలనను సాధ్యపడుతుంది.

ఈ ప్రధాన విశ్వాస ప్రమాణములు కాకుండా, క్రైస్తవ్యం అంటే ఏంటి మరియు క్రైస్తవ్యం నమ్మేది ఏమిటి అనే దానిని తెలుపుటకు, లేదా ఏమి ఉండాలో తెలుపుటకు, ఇతర అనేక విషయములు కూడా ఉన్నాయి. క్రైస్తవులు పరిశుద్ధ గ్రంధమును ప్రేరేపితమైన, “దైవావేశం” వలన కలిగిన దేవుని వాక్యముగా నమ్ముతారు మరియు దాని యొక్క బోధ అంతయు విశ్వాసము మరియు ఆచరణల విషయంలో అంతిమ అధికారం కలిగి ఉన్నదని నమ్ముతారు (2 తిమోతి 3:16; 2 పేతురు 1:20-21). ముగ్గురు వ్యక్తులుగా ఉండే ఒకే దేవుని క్రైస్తవులు నమ్ముతారు – తండ్రి, కుమారుడు (యేసు క్రీస్తు), మరియు పరిశుద్ధాత్మ.

మానవాళి ప్రత్యేకంగా దేవునితో ఒక సంబంధమును కలిగియుండుటకు సృష్టించబడ్డారని, కాకపోతే పాపము మనుష్యులందరిని దేవుని నుండి దూరం చేస్తుందని క్రైస్తవులు నమ్ముతారు (రోమా. 3:23; 5:12). యేసు క్రీస్తు ఈ భూమిపై నడచాడని, సంపూర్ణమైన దేవునిగా ఉండి కూడా సంపూర్ణమైన మానవునిగా ఉన్నాడని, మరియు శిలువ మరణం పొందాడని (ఫిలిప్పీ. 2:6-11) క్రైస్తవ్యం విశ్వసిస్తుంది. తన మరణము తరువాత క్రీస్తు సమాధి చేయబడి, తిరిగి లేచి, తండ్రి కుడిపార్శ్వమందు ఉండి, నిరంతరమూ విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని క్రైస్తవులు నమ్ముతారు (హెబ్రీ. 7:25). మనుష్యులందరూ చేసిన పాపముల వలన కట్టవలసిన పరిహారమును సంపూర్తిగా కట్టుటకు శిలువపై క్రీస్తు యొక్క మరణము సరిపోయిందని, ఇదే దేవునికిని మానవునికిని మధ్య తెగిపోయిన సంబంధములను పునరుద్ధరిస్తుందని క్రైస్తవ్యం నమ్ముతుంది (హెబ్రీ. 9:11-14; 10:10; రోమా. 5:8; 6:23).

రక్షించబడి మరణము తరువాత పరలోకమునకు ప్రవేశమును పొందాలంటే శిలువపై క్రీస్తు సమాప్తం చేసిన కార్యముపై తమ సంపూర్ణ విశ్వాసమును ఒకరు ఉంచాలని క్రైస్తవ్యం బోధిస్తుంది. క్రీస్తు మన స్థానంలో మరణించి మన సొంత పాపముల కొరకైన మూల్యాన్ని చెల్లించాడని మనము నమ్మినయెడల, అప్పుడు మనము రక్షించబడతాము. రక్షణను పొందుకొనుటకు ఎవరైనా చేయవలసినది ఏమీ లేదు. మనంతట మనముగా దేవుని మెప్పించుటకు “మంచిగా” ఉండలేము, ఎందుకంటే మనమందరమూ పాపులము (యెషయా 53:6; 64:6-7). ఇంకా చేయవలసినది ఏమియు లేదు, ఎందుకంటే క్రీస్తు పని అంతయూ చేసేశాడు! ఆయన శిలువపై ఉన్నప్పుడు యేసు అన్నాడు “సమాప్తమైనది” (యోహాను 19:30) అని, అంటే విమోచనా కార్యము సమాప్తమైనదని అర్ధం.

క్రైస్తవ్యం ప్రకారముగా, రక్షణ అనగా పాత పాపపు స్వభావము నుండి విడుదల పొంది దేవునితో సరైన సంబంధమును కలిగియుండుటకు స్వతంత్రులుగా ఉండటమే. ఒకప్పుడు మనము పాపమునకు బానిసలముగా ఉండియుండగా, ఇప్పుడు మనము క్రీస్తుకు బానిసలముగా ఉన్నాము (రోమా. 6:15-22). విశ్వాసులు తమ పాపపు శరీరములతో ఈ భూమిపై ఉన్నంత కాలము, పాపముతో వారు నిరంతర పోరాటంలో నిమగ్నులైయుంటారు. ఎట్లైనను, వారివారి జీవితములలో దేవుని వాక్యమును అధ్యయనం చేసి అన్వయించుకుని మరియు పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడినట్లయితే – అంటే, అనుదిన పరిస్థితులలో ఆత్మ యొక్క నడిపింపునకు ఒప్పుకుంటే –పాపముపై తమ పోరాటములపై జయము పొందగల్గుతారు.

కాబట్టి, ఒక వ్యక్తి కొన్ని పనులు చేయాలి లేదా చేయకూడదు అని చాలా మత పద్ధతులు కోరుతుండగా, క్రైస్తవ్యం అంటే మన పాపముల నిమిత్తము క్రీస్తు శిలువపై మరణించి తిరిగి లేచాడని విశ్వసించడమే. మన పాపము యొక్క అప్పు చెల్లించబడింది మరియు మనము దేవునితో సహవాసమును కలిగియుండగలము. మన పాప స్వభావముపై జయమును మనము పొంది దేవునితో సహవాసములో విధేయతతో నడవగలము. ఇదే నిజమైన పరిశుద్ధ గ్రంధానుసారమైన క్రైస్తవ్యం.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రైస్తవ్యం అంటే ఏంటి మరియు క్రైస్తవులు ఏమి నమ్ముతారు?