settings icon
share icon
ప్రశ్న

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమేనా?

జవాబు


ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానము మనము పరిశుద్ధ గ్రంధాన్ని చూసే విధానమును మరియు మన జీవితములలో దానికున్న ప్రాముఖ్యతను నిశ్చయించడమే గాక, మన పైన నిత్యమైన ప్రభావమును అది చూపుతుంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమైతే, అప్పుడు మనము దానిని పోషించాలి, చదవాలి, లోబడాలి, మరియు పూర్తిగా నమ్మాలి. ఒకవేళ పరిశుద్ధ గ్రంధము దేవుని వాక్యమైతే, అప్పుడు దానిని తీసిపారేయడమంటే దేవుడినే తీసిపారేయడం.

దేవుడు పరిశుద్ధ గ్రంధాన్ని మనకు ఇచ్చాడనే వాస్తవము మనపై ఆయనకు గల ప్రేమను ఉదాహరిస్తుంది. “ప్రత్యక్షత” అనే పదమునకు అర్ధము దేవుడు ఎలా ఉంటాడో మరియు దేవునితో మనము సరైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండగలమో అనే విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడని. ఇవి ఎటువంటి విషయములంటే ఒకవేళ పరిశుద్ధ గ్రంధము ద్వారా దేవుడు వాటిని మనకు బయలుపరచకుండా ఉంటె వాటిని మనము తెలుసుకొనలేకపోయేవాళ్ళం. పరిశుద్ధ గ్రంధంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకు షుమారు 1500 సంవత్సరముల కాలములో క్రమక్రమముగా ఇచ్చియుండగా, మానవుడు దేవునితో సరైన సంబంధమును కలిగియుండుటకుగాను కావలసిన ప్రతి విషయమును అది కలిగియుంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమైతే, అన్ని విశ్వాస విషయములలోను, మతసంబంధమైన ఆచారములలోను, మరియునైతిక విషయములలోను అదే ఆఖరుదైన అధికారం.

మనలను మనము అడుగుకొనవలసిన ప్రశ్న ఏమంటే పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమని ఒక మంచి పుస్తకము మాత్రమే కాదని ఎలా తెలుసుకోగలము? ఇప్పటి వరకు వ్రాయబడియున్న అన్ని మతసంబంధిత పుస్తకముల నుండి పరిశుద్ధ గ్రంధాన్ని ప్రత్యేకంగా ఉంచే ఆ విశిష్టమైన సంగతి ఏది? పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమేనని ఏమన్నా ఆధారములు ఉన్నాయా? పరిశుద్ధ గ్రంధము నిజముగానే దేవుని వాక్యమనియు, దైవికమైన ప్రేరణ వలన కలిగినదనియు, ప్రతి విధములైన విశ్వాస మరియు ఆచారవ్యవహార సంబంధిత విషయములకు పూర్తిగా చాలినదనియు చేసే వ్యాఖ్యలలో ఎంతవరకు నిజమున్నదో తెలుసుకొనుటకు పైన వేసిన కొన్ని ప్రశ్నలను ముఖ్యముగా పరిశీలించాలి. పరిశుద్ధ గ్రంధము దేవుని వాక్యముగా పరిగణిస్తుందనే దానిలో ఎట్టి అనుమానము లేదు. పౌలు తిమోతికి ఇచ్చిన మెప్పు విషయంలో ఇది స్పష్టమౌతుంది: “...నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆసంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతిసత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది” (2 తిమోతి 3:15-17).

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమేనని తెలుపుటకు అంతర్గత మరియు బాహ్య ఆధారములు ఉన్నాయి. అంతర్గత ఆధారములు ఏవనగా పరిశుద్ధ గ్రంధంలోనే ఉండి దాని దైవిక మూలాన్ని గూర్చి సాక్ష్యమిచ్చే విషయాలు. పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమేనని తెలుపుటకు గల అంతర్గత ఆధారములలో మొదటిది దాని యొక్క ఐక్యత.దానిలో వాస్తవముగా అరవై ఆరు పుస్తకములు వేరుగా ఉన్నను, మూడు ఖండములలో వ్రాయబడియున్నను, మూడు వివిధ భాషలలో వ్రాయబడియున్నను, షుమారుగా 1500 సంవత్సరముల వ్యవధిలో వ్రాయబడియున్నను, వివిధ జీవన విధానములకు చెందినా 40 మంది కంటే ఎక్కువమంది రచయితల ద్వారా వ్రాయబడియున్నను, పరిశుద్ధ గ్రంధము ఆది నుండి అంతము వరకు ఎటువంటి విబేధములు లేకుండా సమైక్య పుస్తకముగా ఉంటుంది. ఈ ఐక్యత ఇతర అన్ని పుస్తకములకంటే పరిశుద్ధ గ్రంధము విశిష్టమైనదని మరియు నమోదు చేయుటకు దేవుడు మానవులను ప్రేరేపించి వ్రాయించిన మాటలకు దైవిక మూలమున్నదని అనడానికి ఋజువు.

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమే అని అనడానికి ఇంకొక అంతర్గత ఆధారం వాటి ప్రతులలో పొందుపరచబడియున్న ప్రవచనములు. వ్యక్తిగత దేశములైన ఇశ్రాయేలు, కొన్ని పట్టణములు మరియు మానవాళి యొక్క భవిష్యత్తును గూర్చి తెలిపే వందల కొలదీ విస్తృత ప్రవచనములను పరిశుద్ధ గ్రంధము కలిగి ఉంది. ఇతర ప్రవచనములు మెస్సియగా ఉండుటకు రాబోయే వానిని గురించి, తనను నమ్మిన వారికందరికీ రక్షకునిగా ఉండే వాని గూర్చి తెలుపుతున్నాయి. ఇతర మత పుస్తకములలో ఉన్న ప్రవచనములవలే లేదా నోస్ట్రాడమస్ లాంటి వ్యక్తులు చేసే ప్రవచనములవలే కాకుండా, పరిశుద్ధ గ్రంధపు ప్రవచనములు పూర్తిగావిస్తృతమైనవి. యేసుక్రీస్తును గూర్చి పాత నిబంధనలో దరిదాపుగా మూడు వందల ప్రవచనములు ఉన్నవి. ఆయన ఎక్కడ పుడతాడో ఆయన వంశావళి ఏదో అనే విషయములు మాత్రమే గాక ఆయన ఎలా మరణిస్తాడో ఎలా తిరిగి లేస్తాడో అనే విషయాలు కూడా అక్కడ ముందుగానే చెప్పబడినవి. పరిశుద్ధ గ్రంధములో నెరవేరబడిన ప్రవచనములను దైవిక మూలంగా తప్పితే వేరే ఏ హేతువాద విధంగా అయినా వివరించడానికి వీలుకాదు. పరిశుద్ధగ్రంధంలో ఉన్నంత పూర్వప్రకటిత ప్రవచనముల రకముగాని అంతటి పర్యంతముగాని ఏ ఇతర మతగ్రంధాలలో కూడా లేదు.

పరిశుద్ధ గ్రంధము యొక్క దైవిక మూలమునకు గల మూడవ అంతర్గత ఆధారము దాని విశిష్టమైన అధికారము మరియు శక్తి. మొదటి రెండు ఆధారముల కంటే ఇది కొంత వరకు వ్యక్తిగత అనుభవమునకు సంబంధించినదైనప్పటికీ, పరిశుద్ధ గ్రంధము యొక్క దైవిక మూలమునకు ఇది ఒక శక్తివంతమైన సాక్ష్యము. పరిశుద్ధ గ్రంధము యొక్క అధికారము వ్రాయబడిన అన్ని పుస్తకముల వంటి అధికారము కాదు. దేవుని వాక్యము యొక్క అతీంద్రియమైన శక్తి ద్వారా మార్పుచెందిన లెక్కలేని జీవితముల విధానములో ఈ అధికారము మరియు శక్తి బాగా చూడగలం. దాని ద్వారా మద్యపాన బానిసలు బాగయ్యారు, స్వలింగ సంపర్కులు విమోచింపబడ్డారు, విడువబడినవారు మరియు మరణమునకు లోనగువారు మార్చబడ్డారు, గడ్డు నేరస్తులు పునరుద్ధరించబడ్డారు, పాపులుగద్దింపబడ్డారు, మరియు దీని ద్వారా ద్వేషము ప్రేమగా మార్చబడింది. పరిశుద్ధ గ్రంధము క్రియాశీలకమైన మరియు మార్చగల శక్తిని కలిగియుంది మరియు అది వాస్తవముగా దేవుని వాక్యము గనుకనే ఇది సాధ్యమైంది.

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యము అనడానికి బాహ్యమైన ఆధారములు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి పరిశుద్ధ గ్రంధము యొక్క చారిత్రకత. పరిశుద్ధ గ్రంధము చారిత్రక సంఘటనలను వివరుస్తుంది గనుక, దాని వాస్తవికత మరియు ఖచ్చితత్వము ఏ ఇతర చారిత్రక దస్తావేజు వలెనె ధృవీకరించబడుతుంది. పురావస్తుశాఖ ఆధారములు మరియు ఇతర రచనల ద్వారా పరిశుద్ధ గ్రంధంలో ఉన్న చారిత్రక విషయాలు మరలా మరలా ఖచ్చితమైనవిగా మరియు వాస్తవమైనవిగా ఋజువు చేయబడ్డాయి. వాస్తవానికి పరిశుద్ధ గ్రంధముకు మద్దతిచ్చే పురావస్తుశాఖల మరియు ఇతర ప్రాచీనప్రతుల ఆధారములు ప్రాచీన ప్రపంచం నుండి మనకున్న అతిశ్రేష్టముగా నమోదు చేయబడిన పుస్తకముగా దానిని చేస్తుంది. పరిశుద్ధ గ్రంధము ఖచ్చితముగా మరియు వాస్తవముగా చారిత్రకంగా ధ్రువీకరించబడిన సంఘటనలను నమోదు చేస్తుందనే విషయము మతసంబంధమైన విషయాలను మరియు సిద్ధాంతములను గురించి అది ప్రస్తావిస్తూ దేవుని యొక్క నేరైన వాక్యంగా చెప్పుకునే దాని మాటను నిరూపించుటకు సహాయపడుతుందని అనడానికి గొప్ప సూచన.

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యము అని చెప్పుటకు ఇంకొక బాహ్యమైన ఆధారము దాని రచించిన మానవ రచయితల యొక్క యదార్ధత. ముందు తెలిపినట్లుగా, తన మాటలను నమోదు చేయుటకు దేవుడు అనేక వృత్తులకు చెందిన మనుష్యులను వాడుకున్నాడు. ఈ మనుష్యుల జీవితముల అధ్యయనంలో, వారు చాలా యదార్ధంగా మరియు నిజాయితీగా ఉన్నారని మనం చూడగలం. వారు నమ్మిన దానిని బట్టి వారు కొన్నిసార్లు యాతనపెట్టే మరణమును కూడా పొందుటకు సిద్ధపడ్డారన్న విషయం ఈ సాధారణమైన కాని యదార్ధమైన మనుష్యులు దేవుడు తప్పక వారితో మాట్లాడాడని నమ్మారని సాక్ష్యమిస్తుంది. క్రొత్తనిబంధన వ్రాసిన వారు మరియు అనేకమైన వందలకొలదీ విశ్వాసులు (1 కొరింథీ. 15:6) వారి సందేశము యొక్క సత్యమును ఎరిగినవారు ఎందుకనగా యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచిన తరువాత ఆయనను చూచారు మరియు ఆయనతో వీరు సమయమును గడిపారు. తిరిగి లేచిన క్రీస్తును చూడడం వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. భయముతో దాగుకోవడం మానుకొని దేవుడు వారికి బయలుపరచిన సందేశం నిమిత్తముగా చావడానికి కూడా సిద్ధపడ్డారు. పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమని వీరి జీవితములు మరియు మరణములు సాక్ష్యమిస్తున్నాయి.

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమే అనుటకు ఆఖరు బాహ్యమైన ఆధారము పరిశుద్ధ గ్రంధము యొక్క అక్షయత (లేదా నాశనారాహిత్యం). దాని ప్రాధాన్యతను బట్టి మరియు దేవుని నేరైన వాక్యముగా అది చెప్పుకునే విషయాన్ని బట్టి, చరిత్రలో ఏ ఇతర పుస్తకముల కంటే కూడా పరిశుద్ధ గ్రంధము ఘోరమైన దాడులను మరియు వినాశనాత్మకమైన ప్రయత్నాలను చవిచూచింది. డయోక్లీషియన్ వంటి ఆదిమ రోమా చక్రవర్తి మొదలు, కమ్యూనిస్ట్ నిరంకుశుల నుండి నేటి కాలపు నాస్తికులు మరియు ఆజ్ఞేయులు (దేవుడుగాని ఇంద్రియేతరమైన శక్తి గాని లేదని నమ్మేవారు) వరకు పరిశుద్ధ గ్రంధము అన్నిటిని తట్టుకొని దానిపై దాడిచేసిన వారినందరినీ దాటుకొని నేటికి కూడా ప్రపంచంలో అత్యంత ప్రచురితమైన పుస్తకముగా ఈ పరిశుద్ధ గ్రంధము ఉంది.

సమయానుభవం అంతటిలో, సంశయవాదులు పరిశుద్ధ గ్రంధాన్ని ఒక కట్టుకథగా పరిగణించారు కాని పురావస్తు శాఖ దీనిని చారిత్రకమైనదిగా నిర్ధారించింది. వ్యతిరేకులు దీనిని ప్రాచీనమైనదని మరియు పాతబడిపోయినదని దాడి చేశారు, కానిదాని యొక్క నైతిక మరియు న్యాయ సంబంధిత భావనలు మరియు బోధలు ప్రపంచమందంతట గల సమాజములపైన మరియు సంస్కృతులపైన అనుకూల ప్రభావాన్ని చూపింది. ఇది ఇంకను మిథ్యా-శాస్త్రముల ద్వారాను, మానసిక శాస్త్రముల ద్వారాను, మరియు రాజకీయ ఉద్యమాల ద్వారాను దాడి చేయబడుతూనే ఉంది, కాని అది వ్రాయబడినప్పుడు ఎంత సత్యమైనదిగా మరియు సందర్భమునకు తగినదిగా ఉందో అంతే సత్యమైనదిగా మరియు సంబంధించినదిగా ఈనాడు కూడా ఉంది. గడిచిన 2000 సంవత్సరములుగా లెక్కలేనంత మంది జీవితాలను మరియు సంస్కృతులను మార్చిన పుస్తకము ఇది. దాని వ్యతిరేకులు దానిపై ఎంతగా దాడి చేసినా, నాశనం చేసినా, లేదా ఖాతరు చేయకున్నా, పరిశుద్ధ గ్రంధము అలానే ఉంటుంది; దాని వాస్తవికత మరియు జీవితములపై దానికి గల ప్రభావం పొరపాటులేనివి. దానిని చెరుపుటకు, దానిపై దాడి చేయుటకు, లేదా నాశనంచేయుటకు చేసిన అన్ని ప్రయత్నములను దాటి అది ఖచ్చితత్వముతో భద్రపరచబడిన విధానం ఈ పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమనియు మరియు అది ఆయన ద్వారానే మానవాతీతమైన శక్తిచే కాపాడబడుతుందనే వాస్తవానికి గల సాక్ష్యంగా ఉంది. పరిశుద్ధ గ్రంధము ఎంతగా దాడి చేయబడినను అదిమారనిదిగా మరియు నిందలేనిదిగా బయటకు వస్తుందనే విషయం మనలను ఆశ్చర్యపరచకూడదు. మెట్టుకు యేసు చెప్పాడు, “ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు” అని(మార్కు 13:31). ఈ ఆధారములను చూచిన పిమ్మట నిస్సందేహంగా ఎవరైనా చెప్పొచ్చు, అవును, పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యము అని.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పరిశుద్ధ గ్రంధము నిజముగా దేవుని వాక్యమేనా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries