settings icon
share icon
ప్రశ్న

ఆత్మీయ మరణం అంటే ఏమిటి?

జవాబు


మరణం అంటే వియోగం. శారీరక మరణం అంటే ఆత్మ శరీరం నుండి విడిపోవడం. అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుని నుండి విడిపోవడం. ఆదికాండము 2:17లో, దేవుడు ఆదాముతో, నిషేధిత ఫలమును తిన్న దినమున నీవు "నిశ్చయముగా చనిపోవుదువు" అని చెప్పాడు. ఆదాము నిజంగానే పతనమయ్యాడు, కానీ అతని శారీరక మరణం వెంటనే జరగలేదు; దేవుడు మరొక రకమైన మరణాన్ని—ఆత్మీయ మరణాన్ని—మనస్సులో ఉంచుకుని ఉండాలి. దేవుని నుండి ఈ వేరుపడటమే మనం ఆదికాండము 3:8లో కచ్చితంగా చూస్తాము. ఆదాము మరియు హవ్వ ప్రభువు స్వరము వినినప్పుడు, వారు "యెహోవా దేవుని సన్నిధినుండి తమ్మును తాము దాచుకొనిరి." ఆ సహవాసం తెగిపోయింది. వారు ఆత్మీయంగా చనిపోయారు.

క్రీస్తు లేని మనిషి ఆత్మీయంగా చనిపోయినవాడు. ఎఫెసయులు 4:18లో పౌలు దీనిని "దేవుని జీవమునుండి విముఖులై" అని వర్ణిస్తాడు. (జీవమునుండి వేరు చేయబడటం అనేది చనిపోవడమే.) తోటలో దాక్కున్న ఆదాములాగా, సహజ మనుష్యుడు దేవుని నుండి ఏకాకిగా ఉంటాడు. మనము తిరిగి పుట్టినప్పుడు, ఆత్మీయ మరణం తొలగిపోతుంది. రక్షణకు ముందు, మనము (ఆత్మీయంగా) చనిపోయి ఉన్నాము, కానీ యేసు మనకు జీవమును ఇస్తాడు. "అపరాధములయందును పాపములయందును మృతులై యున్న మీకు ఆయన జీవమును ఇచ్చెను," (ఎఫెసయులు 2:1 NKJV). "మీరు మీ పాపములయందును, మీ అపవిత్ర స్వభావముయందును మృతులై యున్నప్పుడు, దేవుడు మీకు క్రీస్తుతోకూడ జీవమును అనుగ్రహించెను. ఆయన మన యెల్ల పాపములను క్షమించెను" (కొలొస్సయులు 2:13).

ఉదాహరణకు, యోహాను 11లో యేసు లజరుసును లేపిన సంఘటనను ఆలోచించండి. శారీరకంగా చనిపోయిన లజరుసు తన కోసం ఏమీ చేసుకోలేకపోయాడు. అతడు క్రీస్తు సహాయం తప్ప—ఆయన "పునరుత్థానం మరియు జీవం" (యోహాను 11:25)—మరే సహాయానికైనా లేదా ఆశకైనా అందని స్థితిలో, ఏ ఉత్తేజనకైనా స్పందించలేక, తన చుట్టూ ఉన్న జీవానికి అచేతనంగా, అన్ని రకాల సహాయానికి మించి ఉన్నాడు. క్రీస్తు పిలుపుతో, లాజరులో జీవం నిండింది, మరియు అతడు దానికి అనుగుణంగా స్పందించాడు. అదే విధంగా, యేసు మనలను తన వైపు పిలిచే వరకు మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాము, మనలను మనం రక్షించుకోలేకపోయాము, దేవుని జీవాన్ని గ్రహించే శక్తి మనకు లేదు. ఆయన మనకు జీవం పోశారు; "మనం చేసిన నీతి కార్యముల నిమిత్తము కాదు, తన కరుణాప్రకారము" (తీతు 3:5).

ప్రకటన గ్రంథం "రెండవ మరణం" గురించి చెబుతుంది, అది దేవుని నుండి చివరి (మరియు శాశ్వతమైన) వియోగం. క్రీస్తులో నూతన జీవాన్ని ఎన్నడూ అనుభవించని వారు మాత్రమే రెండవ మరణంలో పాలుపంచుకుంటారు (ప్రకటన 2:11; 20:6, 14; 21:8).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ఆత్మీయ మరణం అంటే ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries