ప్రశ్న
యేసు బ్రతికే ఉన్నాడా? యేసు బ్రతికే ఉన్నాడనడంలో అర్థం ఏమిటి?
జవాబు
ఆయన రెండు వేల సంవత్సరాలకు పైగా క్రితం ఈ భూమిపై నడిచారు. మనం ఆయన శిలువ మరణం మరియు ఆయన బోధనల గురించి వింటాము. ఈస్టర్ అనేది ఆయన పునరుత్థానం గురించినది. కానీ అక్కడే కొంతమంది తటపటాయిస్తారు. అంటే యేసు బ్రతికే ఉన్నారా? బహిరంగంగా శిలువ వేయబడిన ఒక వ్యక్తి మృతులలో నుండి తిరిగి లేవడం ఎలా సాధ్యం? నజరేయుడైన యేసు క్రీస్తు జీవించారని చరిత్ర ఖండించలేని సాక్ష్యాలను అందిస్తుంది, కానీ ఆయన ఈ రోజు కూడా బ్రతికే ఉన్నారా? క్రైస్తవులు యేసు సజీవంగా ఉన్నట్లుగా ఆయనను ఆరాధిస్తారు, పాటలు పాడతారు మరియు ప్రార్థన చేస్తారు. అలా చేయడం వారి తప్పా? యేసు ఏ అర్థంలో "సజీవంగా" ఉన్నాడు?
భౌతిక ప్రపంచానికి పరిమితమైన మానవులుగా, మనం తరచుగా జీవితాన్ని శారీరకతతో నేరుగా ముడిపడి ఉంటుందని అర్థం చేసుకుంటాము—ఒక వ్యక్తి శరీరం సజీవంగా ఉంటే, ఆ వ్యక్తి కూడా సజీవంగా ఉన్నట్లే అని భావిస్తాము. కానీ జీవితం అంతకంటే లోతైనది. ఆత్మ లోకం భౌతిక లోకం అంత నిజమైనదే. భూమి సృష్టించబడకముందే, దేవునితో ఏకంగా, క్రీస్తు జీవించి ఉన్నాడని ఫిలిప్పీయులు 2:5–11 వివరిస్తుంది (యోహాను 1:1–3తో పోల్చండి). దేవుని శాశ్వత కుమారుడు ఎల్లప్పుడూ జీవించి ఉన్నాడు. ఆయన శరీరం సమాధిలో పడి ఉన్నప్పుడు కూడా, యేసు ఎన్నడూ మరణించి లేడు.
యేసు భౌతిక ప్రపంచానికి అతీతమైన జీవితం గురించి తరచుగా మాట్లాడారు (యోహాను 10:10). ఆయనను నమ్మిన ఎవరికైనా నిత్యజీవం ఇస్తానని వాగ్దానం చేశారు (యోహాను 3:16–18). తాను స్థాపించడానికి వచ్చిన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని ఆయన వివరించారు (యోహాను 18:36).
దేవుడు మొదటి మనిషిని సృష్టించినప్పుడు, "ఆయన మనిషి నాసికలలో జీవశ్వాసమును పీల్చెను, మరియు ఆ మనిషి జీవముగల ప్రాణియైయుండెను" (ఆదికాండము 2:7). ఆ జీవం శాశ్వతుడైన దేవుని నుండి వచ్చింది. దేవుడు తన సొంత జీవాన్ని మనిషిలోకి పీల్చాడు, అందుకే మానవ జీవం మొక్కలు మరియు జంతువుల జీవానికి భిన్నంగా ఉంటుంది. దేవుడు ఎల్లకాలం జీవించే విధంగానే, మనుషులకు కూడా ఎల్లకాలం జీవించడానికి ఒక ఆత్మ ఉంది. శరీరం చనిపోతుంది, కానీ అది కూడా మళ్ళీ లేపబడుతుంది. యేసు శిలువపై మరణించినప్పుడు, ఆయన శరీరం నిజంగా మరణించి సమాధి చేయబడింది, కానీ ఆయన ఆత్మ వేరే చోట సజీవంగా ఉంది. ఆయన తన ఆత్మను తండ్రి చేతులలో అప్పగించాడు (లూకా 23:46).
దేవుడు యేసును మృతులలో నుండి లేపినప్పుడు, ఆయన ఆత్మ ఆయన శరీరంతో తిరిగి కలిసింది, అది ఇప్పుడు మహిమపరచబడిన శరీరమైంది (ఫిలిప్పీయులు 3:21). ఆయన పునరుత్థానం తర్వాత ఐదువందల మందికి పైగా యేసును చూశారని పౌలు రాశారు (1 కొరింథీయులు 15:6). యేసు నిజంగా సజీవంగా ఉన్నాడని మరియు శారీరకంగా ఉన్నాడని స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షులచేత నూతన నిబంధన వ్రాయబడింది.
యేసు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ఆయన మృతులలో నుండి శరీరంతో పునరుత్థానం పొందారు, మరియు ఆయన శరీరంతో పరలోకంలోకి ఆరోహణుడయ్యారు. పునరుత్థానం తర్వాత నలభై రోజులకు, యేసు శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు, ఆయన అకస్మాత్తుగా గాలిలోకి పైకి లేవడం ప్రారంభించారని అపొస్తలుల కార్యములు 1 వివరిస్తుంది. ఆయన పైకి వెళ్తూ కంటికి కనపడకుండా పోయే వరకు వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు (అపొస్తలుల కార్యములు 1:9–11). యేసు తాను తండ్రియొద్దకు తిరిగి వెళ్తానని ప్రవచించాడు, మరియు ఆయన సరిగ్గా అదే చేశాడు (యోహాను 14:1–2; యోహాను 20:17).
యేసు దేవునితో, దేవదూతలతో, మరియు రక్షణ కొరకు ఆయనను నమ్మిన వారందరితో పరలోకంలో సజీవంగా ఉన్నారు (2 కొరింథీయులు 5:8). ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులైయున్నారు (కొలొస్సయులు 3:1), "ఆకాశములన్నిటికంటె ఉన్నతమైన స్థలములో" (ఎఫెసయులు 4:10). భూమిపై ఉన్న తన అనుచరుల కోసం "ఆయన ఎల్లప్పుడూ మధ్యవర్తిత్వం చేస్తూ జీవిస్తూ ఉంటాడు" (హెబ్రీయులు 7:25). మరియు ఆయన మళ్ళీ తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు (యోహాను 14:1–2).
యేసు ఆత్మ ఎన్నటికీ చావనట్లే, మన ఆత్మలు కూడా చావవు (యోహాను 11:25–26). మనం ఎక్కడో ఒకచోట శాశ్వతంగా జీవిస్తాము. దేవుని రక్షణ ప్రసాదానికి మనం ఎలా స్పందిస్తామో అదే మన గతిని నిర్ణయిస్తుంది (యోహాను 3:16-18). యేసు తన అనుచరులతో, "నేను బ్రతికే ఉన్నాను గనుక మీరును బ్రతికియుందురు" అని చెప్పాడు (యోహాను 14:19). మన ప్రభువైన యేసు వలె మనం చనిపోవచ్చు, కానీ మరణం అంతం కాదని తెలిసి, ఆ గొప్ప నిరీక్షణపై మన జీవితాలను నిర్మించుకోవచ్చు.
English
యేసు బ్రతికే ఉన్నాడా? యేసు బ్రతికే ఉన్నాడనడంలో అర్థం ఏమిటి?