ప్రశ్న
క్రీస్తు రక్తమునకు అర్థం ఏమిటి?
జవాబు
కొత్త నిబంధనలో "క్రీస్తు రక్తం" అనే పదం అనేకసార్లు ఉపయోగించబడింది మరియు ఇది మన కొరకు యేసు అనుభవించిన బలి మరణం మరియు సంపూర్ణ ప్రక్షాళన కార్యం యొక్క వ్యక్తీకరణ. రక్షకుని రక్తం గురించిన ప్రస్తావనలలో ఆయన శిలువ మీద అక్షరాలా రక్తము చిందించాడనే వాస్తవం ఉన్నప్పటికీ, దానికంటే ముఖ్యంగా ఆయన పాపుల కొరకు రక్తము చిందించి మరణించాడనేది. క్రీస్తు రక్తానికి, యుగయుగములుగా అనంతమైన సంఖ్యలో ప్రజలు చేసిన అనంతమైన పాపాలను క్షమించే శక్తి ఉంది, మరియు ఆ రక్తములో విశ్వాసముంచిన వారందరు రక్షించబడతారు.
పాపమునకు ప్రాయశ్చిత్తముగా క్రీస్తు రక్తము యొక్క వాస్తవికత మోషే ధర్మశాస్త్రములో ఉద్భవించింది. సంవత్సరానికి ఒకసారి, ప్రజల పాపముల కొరకు ఆలయ బలిపీఠము మీద పూజారి జంతువుల రక్తమును అర్పించవలసియుండెను. "నిజానికి, ధర్మశాస్త్రము ప్రకారము దాదాపు సర్వము రక్తముతో పవిత్రపరచబడవలెను, మరియు రక్తము చిందకయే క్షమాపణ లేదు" (హెబ్రీయులు 9:22). కానీ ఇది పరిమితమైన ప్రభావశీలతను కలిగిన రక్తార్పణ, అందుకే దానిని పదే పదే అర్పించవలసి వచ్చింది. ఇది యేసు సిలువ మీద అర్పించిన "ఒక్కసారి కొరకు" అనే బలికి ఒక ముందస్తు సూచన (హెబ్రీయులు 7:27). ఆ బలి అర్పించబడిన తర్వాత, ఎద్దులు మరియు మేకల రక్తానికి ఇకపై అవసరం లేదు.
క్రీస్తు రక్తమే నూతన నిబంధనకు ఆధారం. ఆయన శిలువకు వెళ్ళే ముందు రాత్రి, యేసు తన శిష్యులకు ద్రాక్షారసపు గిన్నెను అందించి, "ఈ గిన్నె నా రక్తములో నూతన నిబంధన, అది మీకొరకు పోయబడుచున్నది" అని చెప్పారు (లూకా 22:20). గిన్నెలో ద్రాక్షారసమును పోయడం అనేది, ఆయనను విశ్వసించే వారందరి కొరకు పోయబడే క్రీస్తు రక్తానికి ప్రతీకగా నిలిచింది. ఆయన సిలువపై తన రక్తాన్ని చిందించినప్పుడు, నిరంతర జంతు బలిల కోసం ఉన్న పాత నిబంధన యొక్క అవసరాన్ని ఆయన తొలగించాడు. వారి రక్తం ప్రజల పాపాలను తాత్కాలికంగా కప్పివేయడానికి మాత్రమే సరిపోయేది, కానీ శాశ్వతంగా కాదు, ఎందుకంటే పరిశుద్ధుడైన మరియు అనంతమైన దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి, పరిశుద్ధమైన మరియు అనంతమైన బలి అవసరం. "అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఎందుకంటే ఎద్దుల యొక్క మరియు మేకల యొక్క రక్తం పాపాలను తొలగించడం అసాధ్యం" (హెబ్రీయులు 10:3). ఎద్దులు మరియు మేకల రక్తం పాపానికి ఒక "జ్ఞాపకార్థం"గా ఉన్నప్పటికీ, "లోపము లేని, మచ్చలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం" (1 పేతురు 1:19) దేవునికి మనకున్న పాపపు అప్పును పూర్తిగా చెల్లించింది, మరియు పాపమునకు మనకు ఇకపై ఇతర బలిదానాలు అవసరం లేదు. యేసు మరణిస్తున్నప్పుడు, "ఇది నెరవేరినది" అని చెప్పారు, మరియు ఆయన ఉద్దేశించినది అదే—మన కొరకు "శాశ్వతమైన విమోచనను పొంది" (హెబ్రీయులు 9:12), విమోచన యొక్క సంపూర్ణ కార్యం శాశ్వతంగా పూర్తయింది.
క్రీస్తు రక్తం విశ్వాసులను పాపమునుండి మరియు నిత్యశిక్ష నుండి విమోచించడమే కాకుండా, "ఆయన రక్తము మన మనస్సాక్షిని నిష్ప్రయోజనమైన కార్యముల నుండి పవిత్రపరచి, మనము జీవముగల దేవునికి సేవ చేయునట్లు చేయును" (హెబ్రీయులు 9:14 NCV). దీని అర్థం, రక్షణ పొందడానికి "ప్రయోజనరహితమైన" బలిదానాలు అర్పించాల్సిన అవసరం నుండి మనం ఇప్పుడు విముక్తి పొందడమే కాకుండా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి శరీర సంబంధమైన విలువలేని మరియు ఫలించని క్రియలపై ఆధారపడాల్సిన అవసరం నుండి కూడా విముక్తి పొందాము. క్రీస్తు రక్తం మనలను విమోచించినందున, మనం ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నాము (2 కొరింథీయులు 5:17), మరియు ఆయన రక్తం ద్వారా మనం పాపం నుండి విడుదల పొంది, జీవముగల దేవునికి సేవ చేయడానికి, ఆయనను మహిమపరచడానికి, మరియు ఆయనతో నిరంతరం ఆనందించడానికి వీలు కలుగుతుంది.
English
క్రీస్తు రక్తమునకు అర్థం ఏమిటి?