settings icon
share icon
ప్రశ్న

యేసు దావీదు కుమారుడని అనడంలో అర్థం ఏమిటి?

జవాబు


కొత్త నిబంధనలో పదిహేడు వచనాలు యేసును "దావీదు కుమారుడు"గా వర్ణిస్తాయి. కానీ, దావీదు యేసు కంటే సుమారు 1,000 సంవత్సరాల ముందు జీవించినప్పుడు, యేసు ఎలా దావీదు కుమారుడు కాగలడు అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం ఏమిటంటే, క్రీస్తు (మెస్సయ్య) దావీదు సంతానం గురించిన ప్రవచనాన్ని (2 సమూయేలు 7:12–16) నెరవేర్చాడు. యేసు వాగ్దానము చేయబడిన మెస్సయ్య, అంటే ఆయన దావీదు వంశానికి చెందినవాడై ఉండాలి. మత్తయి 1, యేసు తన మానవత్వంలో, తన చట్టబద్ధమైన తండ్రియైన యోసేపు ద్వారా అబ్రహం మరియు దావీదు యొక్క ప్రత్యక్ష వారసుడని వంశావళి రుజువును ఇస్తుంది. లూకా 3లోని వంశావళి, యేసు యొక్క వంశాన్ని ఆయన తల్లి మరియ ద్వారా వివరిస్తుంది. యేసు యోసేపు ద్వారా దత్తత పద్ధతిలో మరియు మరియ ద్వారా రక్త సంబంధంతో దావీదు వారసుడు. "ఆయన భౌతిక జీవితములో [క్రీస్తు యేసు] దావీదు వంశస్థుడు" (రోమీయులకు 1:3).

ప్రధానంగా, "దావీదు కుమారుడు" అనే బిరుదు కేవలం భౌతిక వంశావళికి సంబంధించిన ప్రకటన కంటే ఎక్కువ. ఇది ఒక మెస్సయ్యా సంబంధమైన బిరుదు. ప్రజలు యేసును దావీదు కుమారుడని ప్రస్తావించినప్పుడు, ఆయన ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విమోచకుడని, పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు అని వారు ఉద్దేశించారు.

విశ్వాసమునుబట్టి కరుణను గాని స్వస్థతను గాని కోరుచున్న జనులు యేసును అనేకమారులు "ప్రభువా, దావీదు కుమారుడా" అని పిలిచారు. దయ్యముచే బాధపడుచున్న కుమార్తె గల స్త్రీ (మత్తయి 15:22) మరియు దారిపక్కన ఉన్న ఇద్దరు అంధులు (మత్తయి 20:30) సహాయం కోసం దావీదు కుమారుని పిలిచారు. వారు ఆయనకు ఇచ్చిన గౌరవ బిరుదులు ఆయన పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించాయి. ఆయనను "ప్రభువు" అని పిలవడం ఆయన దైవత్వం, అధికారం మరియు శక్తికి సంబంధించిన వారి అవగాహనను వ్యక్తపరిచింది, మరియు ఆయనను "దావీదు కుమారుడా" అని పిలవడం ఆయన మెస్సయ్య అని వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచింది.

యేసును ప్రజలు "దావీదు కుమారుడా" అని పిలిచినప్పుడు వారి ఉద్దేశ్యం ఏమిటో పరిసయ్యులు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. కానీ, విశ్వాసంతో ఆర్తనాదం చేసిన వారిలా కాకుండా, పరిసయ్యులు తమ గర్వంతో ఎంతగానో కళ్ళుమూసుకుపోయారు, అందువల్ల కళ్ళులేని భిక్షగాళ్ళు చూడగలిగిన దానిని కూడా వారు చూడలేకపోయారు—అదేమిటంటే, తమ జీవితమంతా తాము ఎదురుచూస్తున్నామని చెప్పుకున్న మెస్సయ్య ఇక్కడే ఉన్నాడని. వారు తమకు అర్హమని భావించిన గౌరవాన్ని యేసు ఇవ్వనందున ఆయనను ద్వేషించారు, కాబట్టి ప్రజలు యేసును రక్షకునిగా స్తుతించడం విన్నప్పుడు, వారు కోపంతో రగిలిపోయారు (మత్తయి 21:15) మరియు ఆయనను నాశనం చేయడానికి కుట్ర పన్నారు (లూకా 19:47).

యేసు ఆ బిరుదు యొక్క అర్థాన్ని వివరించమని వారిని అడగడం ద్వారా శాస్త్రులను, పరిసీయులను మరింత గందరగోళపరిచారు: దావీదు స్వయంగా ఆయనను "నా ప్రభువు" అని పిలిచినప్పుడు (మార్కు 12:35–37; చూ. కీర్తనలు 110:1), మెస్సయ్య దావీదు కుమారుడు ఎలా కాగలడు? ధర్మశాస్త్ర బోధకులు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. అందువల్ల యేసు, యూదు నాయకులు బోధకులుగా అసమర్థులు అని, మరియు మెస్సయ్య యొక్క నిజ స్వరూపం గురించి పాత నిబంధన ఏమి బోధించిందో అనే దానిపై వారికి ఉన్న అజ్ఞానాన్ని బయటపెట్టాడు, తద్వారా వారిని తన నుండి మరింతగా దూరం చేసాడు.

మార్కు 12:35లో యేసు ఈ ప్రశ్న అడగడంలోని ఉద్దేశ్యం ఏమిటంటే, మెస్సయ్య దావీదు యొక్క శారీరక కుమారుడి కంటే గొప్పవాడు. ఆయన దావీదుకు ప్రభువైతే, ఆయన దావీదు కంటే గొప్పవాడై ఉండాలి. ప్రకటన 22:16లో యేసు చెప్పినట్లుగా, "నేను దావీదు మూలమును సంతానమును." అనగా, ఆయన దావీదును సృష్టించినవాడు మరియు దావీదు వంశస్థుడు కూడా. మాంసరూపంలోకి వచ్చిన దేవుని కుమారుడు మాత్రమే అలా చెప్పగలడు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు దావీదు కుమారుడని అనడంలో అర్థం ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries