settings icon
share icon
ప్రశ్న

వ్యవస్థీకృత మతమును నేను ఎందుకు నమ్మాలి?

జవాబు


“మతమునకు” నిఘంటువు యొక్క నిర్వచనం ఈ విధంగా ఉండవచ్చు, “ప్రవర్తన మరియు ఆచారముల ద్వారా ఆరాధించబడు దేవునిపై లేక దేవుళ్లపై నమ్మకము: నమ్మకము, ఆరాధన మొదలగునవి కలిగి ఎక్కువగా కొన్ని నైతిక విలువలు కలిగిన ఒక విశేషమైన వ్యవస్థ.” ఈ నిర్వచనము యొక్క వెలుగులో, బైబిల్ వ్యవస్థీకృత మతమును గూర్చి మాట్లాడుతుంది, కాని అనేక విషయాలలో “వ్యవస్థీకృత మతము” యొక్క ఉద్దేశము మరియు ప్రభావము దేవునికి ఇష్టానుసారమైనది కాదు.

ఆదికాండము 11వ అధ్యాయములో, ఇది వ్యవస్థీకృత మతము యొక్క మొదటి సన్నివేశం కావచ్చు, భూమిని నింపమని దేవుడిచ్చిన ఆజ్ఞను కాదని నోవహు సంతతి వారు బాబెలు గోపురమును నిర్మించుటకు ఒక వ్యవస్థను స్థాపించారు. దేవునితో వారి సంబంధం కంటే వారి ఐక్యత ముఖ్యమని వారు నమ్మారు. దేవుడు కలుగజేసుకొని వారి భాషలను తారుమారు చేసి, ఆ వ్యవస్థీకృత మతమును విరిచాడు.

నిర్గమకాండము 6వ అధ్యాయలోను మరియు ఆ తరువాత, ఇశ్రాయేలు దేశము కొరకు దేవుడు ఒక మతమును “వ్యవస్థీకృతము” చేసాడు. పది ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారమును గూర్చిన నియమాలు, మరియు బలుల వ్యవస్థ అన్ని దేవునిచే స్థాపించబడగా ఇశ్రాయేలీయులు వాటిని అనుసరించారు. ఈ మతము యొక్క ఉద్దేశము రక్షకుడు-మెస్సీయ యొక్క అవసరతను ఎత్తి చూపుట అని క్రొత్త నిబంధనను మరింత అధ్యయనం చేయుట ద్వారా స్పష్టమవుతుంది (గలతీ. 3; రోమా. 7). అయితే అనేకులు దీనిని అపార్థం చేసుకొని దేవునికి బదులుగా నియమాలను ఆచారాలను ఆరాధించారు.

ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో, ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న సంఘర్షణలు చాలా వరకు వ్యవస్థీకృత మతముకు సంబంధించినవిగా ఉన్నాయి. ఉదాహరణలు బయలు (న్యాయాధి. 6; 1 రాజులు 18), దాగోను (1 సమూ. 5), మరియు మొలెకు (2 రాజులు 23:10) ఆరాధన. దేవుడు తన సార్వభౌమత్వమును మరియు సర్వశక్తిని ప్రదర్శించి ఈ మతాలను అనుసరించువారిని జయించాడు.

సువార్తలలో, క్రీస్తు కాలములో పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు వ్యవస్థీకృత మతమునకు ప్రతినిథులుగా చూపబడ్డారు. వారి అబద్ధ బోధలను గూర్చి మరియు వేషధారణను గూర్చి యేసు తరచుగా వారిని గద్దించాడు. పత్రికలలో, సువార్తను కొన్ని పనులు మరియు ఆచారములతో జతపరచిన కొన్ని వ్యవస్థీకృత గుంపులను మనం చూడవచ్చు. ఈ “క్రైస్తవ్యంతో జతచేయబడిన” మతములను అంగీకరించాలని వీరు కూడా విశ్వాసులను బలవంతపెట్టారు. గలతీయులకు మరియు కొలొస్సయులకు వ్రాసిన పత్రికలు ఇట్టి మతములను గూర్చి హెచ్చరించాయి. ప్రకటన గ్రంథములో, అంత్యక్రీస్తు సర్వలోకమునకు ఒకే మతమును స్థాపించగా వ్యవస్థీకృత మతము లోకముపై ప్రభావము చూపుతుంది.

చాలా సార్లు, వ్యవస్థీకృత మతము దేవుని ఉద్దేశములకు దూరముగా వెళ్తుంది. అయితే, ఆయన ప్రణాళికలో భాగమైన వ్యవస్థీకృత విశ్వాసులను గూర్చి బైబిల్ మాట్లాడుతుంది. ఈ వ్యవస్థీకృత విశ్వాసుల గుంపును దేవుడు “సంఘములు” అని పిలుస్తాడు. సంఘము వ్యవస్థీకృతమై పరస్పర ఆధారం కలిగినదిగా ఉండాలని అపొస్తలుల కార్యముల యొక్క వివరణలు సూచిస్తున్నాయి. వ్యవస్థ భద్రతకు, ఫలితములకు, సువార్త ప్రకటనకు నడిపిస్తుంది (అపొ. 2:41-47). సంఘము విషయములో, దీనిని “వ్యవస్థీకృత అనుబంధం” అని పిలవడం ఉత్తమము.

మతము దేవునితో సహవాసం కలిగియుండుటకు మానవుడు చేయు కృషి. యేసు క్రీస్తు యొక్క బాలి ద్వారా దేవుడు మన కొరకు చేసిన కార్యమును బట్టి దేవునితో అనుబంధం కలిగియుండుట క్రైస్తవ విశ్వాసము. దేవుని చేరుకొనుటకు ఎలాంటి ప్రణాళిక లేదు (ఆయన మన యొద్దకు వచ్చాడు—రోమా. 5:8). గర్వము లేదు (కృప ద్వారా సమస్తము పొందితిమి—ఎఫెసీ. 2:8-9). నాయకత్వమును గూర్చి ఎలాంటి ఘర్షణ ఉండకూడదు (క్రీస్తే శిరస్సు—కొలస్సి. 1:18). ఎలాంటి పక్షపాతం ఉండకూడదు (మనమంతా క్రీస్తులో ఐక్యులము—గలతీ. 3:28). వ్యవస్థీకృతమైయుండుట సమస్య కాదు. మతము యొక్క నియమాలు మరియు ఆచారాలపై మాత్రమే దృష్టి పెట్టుట సమస్య.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

వ్యవస్థీకృత మతమును నేను ఎందుకు నమ్మాలి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries