settings icon
share icon
ప్రశ్న

విశ్రాంతి దినము ఏ రోజు, శనివారం లేక ఆదివారం? క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరించాలా?

జవాబు


నిర్గమ 20:11లో విశ్రాంతి దినము మరియు సృష్టి మధ్య అనుబంధం ఉన్నదికాబట్టి, “దేవుడు ఏదేను వనములో విశ్రాంతి దినమును స్థాపించెను” అని వాదిస్తుంటారు. దేవుడు ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనుట (ఆది. 2:3) రానున్న విశ్రాంతి దిన నియమమునకు ముందస్తు సూచనగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడచుటకు ముందు విశ్రాంతి దినమునకు ఎలాంటి లేఖన ఆధారము లేదు. ఆదాము నుండి మోషే వరకు విశ్రాంతి దినమును ఆచరించిన గురుతులు లేఖనములో ఎక్కడా కనిపించవు.

విశ్రాంతి దినమును ఆచరించుట దేవుడు మరియు ఇశ్రాయేలు మధ్య ఒక విశేష చిహ్నమని దేవుని వాక్యము చెబుతుంది: “ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము” (నిర్గమ. 31:16–17).

ద్వితీ. 5లో, ఇశ్రాయేలు యొక్క తరువాత తరము వారికి మోషే పది ఆజ్ఞలను పునరుద్ఘాటిస్తున్నాడు. 12-14 వచనాలలో విశ్రాంతి దినమును ఆచరించుటను గూర్చి ఆజ్ఞాపించిన తరువాత, ఇశ్రాయేలు దేశమునకు విశ్రాంతి దినము ఇవ్వబడిన కారణమును మోషే ఇస్తున్నాడు: “నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను” (ద్వితీ. 5:15).

దేవుడు ఇశ్రాయేలుకు విశ్రాంతి దినమును ఇచ్చుటకు కారణం వారు సృష్టిని జ్ఞాపకం చేసుకుంటారు అని కాదు, కాని వారు ఐగుప్తు బానిసత్వమును మరియు ప్రభువు విమోచనను జ్ఞాపకం ఉంచుకుంటారు అని. విశ్రాంతి దినమును ఆచరించుటకు అవసరతలను చూడండి: విశ్రాంతి దిన నియమమును ఆచరించువాడు విశ్రాంతి దినమున తన ఇంటిని విడిచిపెట్టకూడదు (నిర్గమ. 16:29), నిప్పు అంటించకూడదు (నిర్గమ. 35:3), మరియు అతడు పని చేయుటకు ఎవరికీ అనుమతి ఇవ్వకూడదు (ద్వితీ. 5:14). విశ్రాంతి దిన నియమమును ఉల్లంఘించువానికి మరణ శిక్ష విధించవలసియున్నది (నిర్గమ. 31:15; సంఖ్యా. 15:32–35).

క్రొత్త నిబంధన లేఖన భాగములను పరీక్షించుట ద్వారా నాలుగు ముఖ్యమైన బిందువులు మనం చూడవచ్చు: 1) యేసు పునరుత్థాన రూపములో ఎప్పుడు ప్రత్యక్షమైనప్పటికీ ఆ రోజు వారములో మొదటి రోజు అవుతుంది (మత్తయి 28:1, 9, 10; మార్కు 16:9; లూకా 24:1, 13, 15; యోహాను 20:19, 26). 2) అపొస్తలుల కార్యములు మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు విశ్రాంతి దినము పేర్కొనబడిన ఒకేఒక్క సన్నివేశం, సమాజ మందిరములో యూదులకు సువార్త ప్రకటన చేయు సందర్భములో మాత్రమే (అపొ. 13–18 అధ్యాయములు). “యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని” (1 కొరింథీ. 9:20) అని పౌలు వ్రాస్తున్నాడు. పరిశుద్ధులతో సహవాసం చేసి వారిని బలపరచుటకు పౌలు సమాజ మందిరమునకు వెళ్లలేదు, వారి దోషములను చూపి నశించిన వారిని రక్షించుటకు వెళ్లాడు. 3) “ఇది మొదలుకొని నేను అన్య జనుల మధ్యకు వెళ్తాను” (అపొ. 18:6) అని పౌలు ఒక సారి చెప్పాడు, విశ్రాంతి దినము మరలా ఎక్కడా ప్రస్తావించబడలేదు మరియు 4) విశ్రాంతి దినమును ఆచరించాలని సూచించుటకు బదులుగా, క్రొత్త నిబంధనలో మిగిలిన భాగములు దీనికి విరోధమును సూచిస్తున్నాయి (పైనున 3వ బిందువును ఒక సందర్భంలో మినహాయిస్తే తప్ప, దానిని కొలస్సి. 2:16లో చూడవచ్చు).

పైనున్న 4వ బిందువును మరింత దగ్గరగా పరిశీలించుట ద్వారా క్రొత్త నిబంధన విశ్వాసికి విశ్రాంతి దినమును ఆచరించవలసిన అవసరం లేదని, ఆదివారం “క్రైస్తవ విశ్రాంతి దినం” అను ఆలోచన కూడా లేఖనపరమైనది కాదని బయలుపరుస్తుంది. పైన చర్చించిన విధంగా, పౌలు అన్యజనులపై దృష్టి పెట్టిన తరువాత ఒక్క సారి మాత్రమే విశ్రాంతి దినము ప్రస్తావించబడింది, “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది” (కొలస్సి. 2:16–17). క్రీస్తు “వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును” సిలువపై కొట్టివేసినప్పుడు యూదా విశ్రాంతి దినము ఎత్తివేయబడినది (కొలస్సి. 2:14).

ఈ ఆలోచన క్రొత్త నిబంధనలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు పునరుద్ధరించబడింది: “ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు” (రోమా. 14:5–6a). “యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు” (గలతీ. 4:9–10).

క్రీ.శ. 321లో కొంస్టెంట్టైన్ ఇచ్చిన తీర్పు ద్వారా విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారమునకు మార్చబడినది అని కొందరు వాదిస్తారు. ఆదిమ సంఘము ఆరాధన కొరకు ఏ దినమున కూడుకొనేది?సహవాసము లేక ఆరాధన కొరకు ఎలాంటి విశ్రాంతి దినమును (శనివారం) లేఖనము ప్రస్తావించదు. అయితే, వారము యొక్క మొదటి రోజును ప్రస్తావించు స్పష్ట లేఖనములు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు, “ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు” అని అపొ. 20:7 సూచిస్తుంది. “నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” అని 1 కొరింథీ. 16:2లో కొరింథీ విశ్వాసులను పౌలు కోరుతున్నాడు. కొరింథీ. 9:12లో పౌలు ఈ కానుకను “సేవ”గా చూపుతున్నాడు కాబట్టి, ఈ సేకరణ క్రైస్తవ సంఘము యొక్క ఆదివార ఆరాధన కూడికతో అనుబంధం కలిగియుంది. చారిత్రికంగా ఆదివారం, శనివారం కాదు, సంఘములో క్రైస్తవుల కూడికొను రోజైయున్నది, మరియు ఈ అభ్యాసము మొదటి శతాబ్దము నుండి కొనసాగుతుంది.

విశ్రాంతి దినము ఇశ్రాయేలుకు ఇవ్వబడినది, సంఘమునకు కాదు. విశ్రాంతి దినము నేటికి కూడా శనివారమే, ఆదివారము కాదు, మరియు అది ఎన్నడు మార్చబడలేదు. విశ్రాంతి దినము పాత నిబంధన ధర్మశాస్త్రములో భాగము, మరియు క్రైస్తవులు ధర్మశాస్త్రమను కాడి నుండి స్వతంత్రులు (గలతీ. 4:1-26; రోమా. 6:14). ఒక క్రైస్తవుడు విశ్రాంతి దినమును ఆచరించవలసిన పని లేదు-అది ఆదివారమైనా లేక శనివారమైనా. వారములో మొదటి రోజైన ఆదివారం, ప్రభువు దినము (ప్రకటన 1:10) క్రీస్తు మన పునరుత్థాన శిరస్సుగా నూతన సృష్టిని జరుపుకొంటుంది. మోషే విశ్రాంతి దినము-విశ్రాంతి- ఆచరించుటకు మనం బద్ధులముకాము, కాని తిరిగిలేచిన క్రీస్తును అనుసరించుటకు-సేవ-మనం స్వతంత్రులము. విశ్రాంతి దిన విశ్రాంతిని ఆచరించాలో లేదో ప్రతి వ్యక్తిగత క్రైస్తవుడు స్వయంగా నిర్ణయించుకోవాలని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, “ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను” (రోమా. 14:5). మనం అనుదినము దేవుని ఆరాధించాలి, కేవలం శనివారం లేక ఆదివారం మాత్రమే కాదు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

విశ్రాంతి దినము ఏ రోజు, శనివారం లేక ఆదివారం? క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరించాలా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries