settings icon
share icon
ప్రశ్న

కాల్వినిజం x అర్మినియనిజం” – ఏ ఆలోచన సరియైనది?

జవాబు


ఈ కాల్వినిజం మరియు అర్మినియనిజం అను వాదనలు రక్షణ విషయములో దేవుని సార్వభౌమత్వమునకును అలాగే మానవుని యొక్క బాధ్యతకును మధ్య గల సంబంధమును వివరించుటకు ప్రయత్నించే రెండు విధములైన వేదాంతశాస్త్రములు. కాల్వినిజం అనునది జాన్ కాల్విన్ అనే వ్యక్తి ద్వారా వచ్చింది, ఈయన 1509-1564 మధ్యకాలములో జీవించిన ఒక ఫ్రాన్స్ దేశపు వేదాంతశాస్త్రజ్ఞుడు. అర్మినియనిజం అనునది 1560-1609 మధ్యకాలములో జీవించిన డానిష్ వేదాంతశాస్త్రజ్ఞుడైన జాకోబస్ ఆర్మీనియస్ అను పేరునుండి గ్రహించబడింది.

ఈ రెండు విధానములను ఐదు ప్రధాన అంశములలో సారాంశముగా చెప్పవచ్చు. కాల్వినిజం అనునది మానవుని సంపూర్ణ పతన స్థితిని ప్రతిపాదిస్తుండగా అర్మినియనిజం అనునది పాక్షిక పతన స్థితిని ప్రతిపాదిస్తుంది. పూర్తి పతనమును గూర్చి కాల్విన్ చేసిన సిద్ధాంతము ఏమంటుందంటే మానవునిలోని ఒక్క ప్రతి విషయము కూడా పాపము వలన చెడిపోయింది; కాబట్టి, తమ సొంత స్థితిలో నుండి తనంతట తానుగా మానవుడు దేవుని దగ్గరకు వచ్చుటకు సమర్ధుడు కాడు అంటున్నాడు. కాని పాక్షిక పతన సిద్ధాంతము మానవునిలోని ప్రతి విషయము పాపము వలన మచ్చ చేయబడింది, కానివారంతట వారుగా దేవునిఫై తమ విశ్వాసమును ఉంచలేనంతగా మాత్రం వారు పాపము వలన మచ్చచేయబడలేదు అంటుంది. గమనిక: సంప్రదాయకమైన అర్మినియనిజం మాత్రం “పాక్షిక పతన స్థితి”ని విస్మరించి కాల్వినిస్టుల “సంపూర్ణ పతన స్థితి”కి దగ్గరగా వస్తారు (ఈ పతనము యొక్క పరిమాణము మరియు అర్ధములు ఇంకను అర్మినియులలో వాదించబడుతూనే ఉన్నాయి). సాధారణంగా, ఈ సంపూర్ణ పతన స్థితికిని మరియు రక్షణకు మధ్య ఒక “మధ్యంతర” స్థితి ఉందని అర్మినియనులు నమ్ముతారు. ఈ స్థితిలో, అంటేముందుగా నిర్ణయించబడిన కృప ద్వారా ఇవ్వబడిన ఈ స్థితిలో, పాపి క్రీస్తు దగ్గరకు తేబడి రక్షణను ఎన్నుకొనుటకు దేవుడిచ్చిన సామర్ధ్యం కలిగి ఉంటాడు.

ఎన్నుకొనుట అనునది బేషరతుగా ఉన్నదని కాల్వినిజం విశ్వసిస్తుండగా, అర్మినియనిజం మాత్రం ఎన్నుకొనుటలో షరతులు కూడా ఉంటాయని నమ్ముతుంది. బేషరతు ఎన్నిక అంటే ఏమిటంటే దేవుడు తన చిత్తము మీదనే ఆధారపడి వ్యక్తులను రక్షణకు ఎన్నుకుంటాడు, కాని వ్యక్తిలోని సామర్ధ్యతలను లేదా యోగ్యతలను చూచి మాత్రం కాదు అని. షరతులతో కూడిన ఎన్నిక ఏమంటుందంటే క్రీస్తును రక్షణ నిమిత్తము ఎవరు నమ్ముతారో అనే విషయమై దేవునికి ఉన్న పూర్వజ్ఞానమును ఆధారము చేసికొని దేవుడు వ్యక్తులను ఎన్నుకుంటాడు, తద్వారా ఆ వ్యక్తి దేవుడిని ఎన్నుకుంటాడు అనే షరతుతో దేవుడు ఆయనను ఎన్నుకుంటాడు అని చెప్తుంది.

కాల్వినిజం ఈ పాపపరిహార క్రమమును పరిమితమైనదిగా చూస్తే, అర్మినియనిజం మాత్రం అపరిమితమైనదిగా దీనిని చూస్తుంది. ఐదు భేదాభిప్రాయలలో కూడా ఇది అత్యంత క్లిష్టమైన అంశము. పరిమిత పరిహార క్రమము అనగా ఏమంటే ఎన్నుకొనబడినవారి నిమిత్తమే యేసు చనిపోయాడు అని నమ్మే ఒక సిద్దాంతం. అపరిమిత పరిహార క్రమము అనగా యేసు అందరికొరకు మరణించాడు, కానివ్యక్తి విశ్వాసము ద్వారా ఆయనను స్వీకరించనంత వరకు ఈ ప్రతిక్షేప మరణము అంతగా ప్రభావం చూపదు అని నమ్మే ఒక సిద్ధాంతం.

దేవుని యొక్క కృప ప్రతిఘటింపలేనిది అని కాల్వినిజం నమ్ముతుంది, కాగా అర్మినియనిజం మాత్రం వ్యక్తి దేవుని కృపను ప్రతిఘటించగలడు అని నమ్ముతుంది. ప్రతిఘటింపలేని కృప ఏమని వాదిస్తుందంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షణ కొరకు పిలిచినప్పుడు, ఆ వ్యక్తి అనివార్యంగా రక్షణ వద్దకు వస్తాడు అని. ప్రతిఘటించగల కృప ఏమి సూచిస్తుంది అంటే దేవుడు అందరిని రక్షణ కొరకు పిలుస్తాడు, కాని చాలా మంది ప్రజలు ఈ పిలుపును ప్రతిఘటించి తిరస్కరిస్తారు అని.

కాల్వినిజం పరిశుద్ధుల యొక్క నిలకడత్వమును గూర్చి మాట్లాడుతుంటే అర్మినియనిజం మాత్రం షరతులతో కూడిన రక్షణను గూర్చి మాట్లాడుతుంది. పరిశుద్ధుల నిలకడత్వము అనగా దేవునిచే ఎన్నుకొనబడిన వ్యక్తి విశ్వాసములో నిలకడగా ఉంటూ క్రీస్తును శాశ్వతముగా విసర్జించక లేదా ఆయననుండి వెనుకకు తిరుగకుండా ఉంటాడు అని చెప్పే ఒక వాదన. షరతులతో కూడిన రక్షణ అంటే క్రీస్తులో ఒక విశ్వాసి, తన సొంత చిత్తములో క్రీస్తునకు దూరముగా వెళ్లిపోయి ఫలితంగా రక్షణను కోల్పోవచ్చు అని చెప్పే ఆలోచన. గమనిక – చాలా మంది అర్మినియన్లు “షరతులతో కూడిన రక్షణ”ను తృణీకరించి “శాశ్వతమైన భద్రత” అనే వాదనను అనుసరిస్తుంటారు.

ఇదిలా ఉండగా, కాల్వినిజం x అర్మినియనిజం అనే వాదనలో ఎవరు సరైనవారు? క్రీస్తు శరీరములో ఉన్న భిన్నత్వముల మధ్య కాల్వినిజం మరియు అర్మినియనిజం వంటి అనేకమైన మిశ్రమములు ఉన్నాయని గ్రహించడం చాలా ఆశక్తిని కలిగించే విషయం. ఐదు-అంశాల కాల్వినిస్టులు మరియు ఐదు-అంశాల అర్మినియన్లు ఉన్నారు, అలాగే రెండు-అంశాల కాల్వినిస్టులు మరియు రెండు-అంశాల అర్మినియన్లు కూడా ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఈ రెండు వాదనలలో కొంతమేర మిశ్రమాన్ని గ్రహిస్తారు. ఆఖరుకు, మనము చెప్పేది ఏమంటే ఈ రెండు విధానాలు విఫలమౌతాయి ఎందుకంటే వివరించలేని దానిని వివరించుటకు ఇవి ప్రయత్నిస్తున్నాయి గనుక. ఇటువంటి కొన్ని భావనలను సంపూర్ణంగా గ్రహించడం అనేది మానవులకు సాధ్యపడని విషయం. అవును, దేవుడే సర్వమైన సార్వభౌమత్వము కలిగినవాడు గనుక ఆయనకు అన్నియు తెలుసు. అవును, రక్షణ నిమిత్తము క్రీస్తులో విశ్వాసమును ఉంచుకొనుట అనే ఒక వాస్తవికమైన నిర్ణయము చేసుకొనుటకు మానవులు పిలువబడ్డారు. ఈ రెండు వాస్తవాలు మనకు కొంత వైరుధ్యముగా అనిపించవచ్చు, కాని దేవుని మనస్సులో ఇది ఖచ్చితమైన అర్ధాన్ని కలిగియుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

కాల్వినిజం x అర్మినియనిజం” – ఏ ఆలోచన సరియైనది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries